తరుముకొస్తున్న తీవ్ర కరువు!
ఐ.ప్రసాదరావు :
* పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణ పరిస్థితులు ఏర్పడటంతో సుమారు 1.5 అధిక ఉష్ణోగ్రత ప్రభావంతో ‘సూపర్ ఎల్ నినో‘గా రూపాంతరం చెందుతున్న ఎల్ నినో ప్రభావం స్పష్టంగా మన దేశంలో కనపడుతున్నది. ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం, వరదలు సంభవిస్తూ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుండగా, దక్షిణ భారతదేశంలో భానుడి భగభగలు, వేడిగాలలుతో ప్రజలు ఆపసోపాలు పడుతున్న పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై ఆధారపడి దాదాపు దేశవ్యాప్తంగా పంటలు సాగు చేస్తూంటారు. ఈ ఎల్ నినో ప్రభావంతో దేశంలో దాదాపు జూలై నెల సగ భాగం గడుస్తున్నా, వర్షాలు కురవక, నేల తడవక, దేశంలో 76% శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో అనేక జలాశయాలు అతి తక్కువ నీటి నిల్వలతో వెలవెలబోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.
సాగు భూములు బీడు భూములుగా మారుతూ రైతులతో పాటు దేశ ప్రజలను, ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్న పరిస్థితి మన దేశంలో కనిపిస్తున్నది. ఎల్ నినో ప్రభావంతో దేశంలో 166 జలాశయాల నీటి నిల్వలు 26% శాతానికి పడిపోయాయి. అత్యంత ఆందోళనకరంగా ‘బీహార్’లోని ‘చందన్’ జలాశయంలో 1.86% మాత్రమే నీటి నిల్వ జూలై మొదటి వారంలో ఉండగా, ‘ఒడిశా’లోని ‘రెంగాలి’ జలాశయంలో 3.15% నీటి నిల్వ, కర్ణాటకలోని ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాల్లో 10.35% శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 15.50% శాతం మాత్రమే వివిధ జలాశయాల్లో నీటి నిల్వలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 166 జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు 47.725 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం) మాత్రమే. ఈ జూలై నాటికి దేశంలో వివిధ జలాశయాల్లో 78,077 పైబడి బీసీఎం నీటి నిల్వలు ఉం డాలి. మరింతగా ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే, మహారాష్ట్రలోని ‘భీమా-ఉజ్జయిని’, తమిళనాడులోని ‘అలియార్’, ఉత్తరప్రదేశ్‌లోని ‘మౌదాహా’ ప్రాజెక్టుల్లో ‘జీరో’ నీటి నిల్వలు నమోదయ్యాయి.
మరిన్ని వివరాల్లోకి వెళ్తే, సాధారణ నీటి నిల్వలతో పోలిస్తే పశ్చిమ బంగాల్‌లో 62% శాతం, మిజోరంలో 54% శాతం, కర్ణాటకలో 46% శాతం, ఒడిశాలో 19% శాతం, కేరళ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో 16 నుంచి 14 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ రాష్ట్రాల్లో తగినంత వర్షాలు కురవకపోతే సాగునీరు, తాగునీరు, జల విద్యుత్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం లో దాదాపు అన్ని జిల్లాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలతోపాటు కుంటు, చెరువుల్లోనూ నీటి నిల్వలు పడిపోయాయి.
దేశవ్యాప్తంగా కరువు ఛాయలు
వరినాట్లు ఇంకా ప్రారంభం కాలేదు. జలాశయాల్లో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల ఆవేదన వర్ణనాతీతం. దేశవ్యాప్తంగా ఉన్న 741 జిల్లాలలో దాదాపు 325 జిల్లాలో లోటు వర్షపాతం, 165 జిల్లాల్లో తీవ్రమైన లోటు వర్షపాతం నమోదైంది. ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కరువు ఛాయ లు అలుముకున్నాయి. కేంద్ర జల సం ఘం (సీడబ్ల్యూసీ) నివేదిక ప్రకారం, సాధారణంగా జూలై నెల నాటికి నైరుతి రుతుపవనాలు వలన దేశంలో దాదాపు అన్ని జలాశయాల్లో నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకుని, కళకళలాడుతూ ఉండా లి.
కానీ, ఎల్ నినో ప్రభావంతో మేఘాలు జాడలేక, వర్షాలు కురవక, దేశవ్యాప్తంగా వేడి వాతావరణం నెలకొంది. దీంతో వర్షాలు కురవక హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, బీహార్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పశ్చిమ బంగాల్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలోని జలాశయాల్లో పరిస్థి తి ఆందోళనకరంగా ఉంది. వర్షాలు కురవకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకోవడంతో పాటు ఉపాధి దెబ్బతింటుంది. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతుంది.
మరోవైపు యుద్ధాల ప్రభావం
ఇప్పటికే గత నాలుగు సంవత్సరాలుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వలన అనేక విషయాలలో మన దేశం ఇబ్బందులు పడుతున్నది. తాజాగా ఇరాన్ యుద్ధం ప్రభావంతో హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత వలన మన దేశానికి సరఫరా అయ్యే గ్యాస్, చమురు దిగుమతులపై పెను ప్రభావం పడింది. తద్వారా ధరలు పెరిగి సామాన్య ప్రజలపై భారం పెరిగింది.
దీనికి తోడు పుండు మీద కారం చల్లికట్టు, ఈ ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవక, పంటలు పండక ఆహార సంక్షోభం పెరిగితే దాదాపు 80% శాతం దేశ జనాభా జీవితాలు, జీవన ప్రమాణాలు కనిష్ట స్థాయికి దిగజారుతాయి. ఇప్పటికే అధిక ధరలు, నిరుద్యోగంతో సతమతమవుతున్న ప్రజలపై ‘ద్రవ్యోల్బణం’ మరింత పెనుభారంగా మారి కుంగదీస్తుంది.
పొదుపు పాటించాల్సిన సమయం
పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తున్నా, దేశవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో ఎల్ నినో ప్రభావంతో, నైరుతి రుతుపవనాలు విస్తరించకుండా ఉండటం వల్ల రైతులు, ప్రజల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వాతావరణ మార్పులు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మంచి దిగుబడి సాధించి, కష్టకాలంలో ఇతర దేశాలకు ఆహార ధాన్యాలు సరఫరా చేసిన మన దేశం, ఎల్ నినో ప్రభావంతో ఆహార సంక్షోభంతోపాటు ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఏర్పడింది.
దీంతో ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రైతులకు భరోసా ఇవ్వాలి. రాయితీలు, ప్రోత్సాహకాలు, సులభంగా రుణాలు మంజూరు చేయాలి. బీమా పథకాలు విస్తరించాలి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. సబ్సీడీలు, తక్కువ ధరలకు విత్తనాలు, ఎరువులు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయ పంటలు, తక్కువ నీటితో పండే పంటలు, డ్రిప్ ఇరిగేషన్‌పై దృష్టి సారించాలి.
ప్రజలు కూడా ఆహార వృథాచేయరాదు. నదుల అనుసంధానంపై దృష్టి సారించాలి. ప్రజలు ప్రత్యామ్నాయ ఆహారపు అలవాట్లు పెంచుకోవాలి. నీటిని వృధా చేయరాదు. విద్యుత్ ఆదా చేయాలి. గ్యాస్, ఇంధన వాడకంలో పొదుపు పాటించాలి. ఎలక్ట్రిక్ వాహనాలు, ఈ20 వాహనాల వినియోగం పెంచాలి. ఏది ఏమైనా, దేశ ప్రజలు అన్ని విషయాల్లో ఇంధన వాడకంలో, ఆహార పదార్థాలు, నీటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు, యుద్ధాలు, కాలుష్యాల వలన సప్లయ్ చైన్ దెబ్బతినడం, అనేక సమస్యలు ఏర్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు, ప్రజలు చక్కటి పరిష్కార మార్గాలను ఆచరిస్తూ, అమలు చేయడం ద్వారానే ఆహర, ఆరోగ్య, ఆర్థిక భద్రతతో ముందుకుసాగగలం. ఐక్యరాజ్యసమితి సూచించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించగలం.
వ్యాసకర్త సెల్: 8374844618






