కశ్మీర్ రాష్ట్ర పోరు!
జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశం మరోసారి జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రాష్ట్ర హోదా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్లమెంట్ సమావేశాల వేళ ఢిల్లీ వేదికగా నిరసనలు చేపట్టడమే అందుకు నిదర్శనం. అయితే, నీట్ పేపర్ లీక్ అంశంపై జరుగుతున్న నిరసనల మూలంగా జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా నిరసనలకు ఎక్కువ ప్రాధా న్యం లభించలేదు.
కాగా, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రక్షణలు కల్పించే ఆర్టికల్ 370 రద్దుతోపాటు ఆ రాష్ట్ర హోదాను కూడా రద్దు చేస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. నాడు శాంతిభద్రతల పరిరక్షణ, ఉగ్రవాద సవాళ్లు, పాలనా అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. అప్పటినుంచి దాదాపు ఐదేళ్లపాటు జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగింది.
2024లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం సాధించగా, ఒమర్ అబ్దుల్లా ము ఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి అధికార పక్షం జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ రాష్ట్ర హోదా పునరుద్ధరణే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఈ పోరాటంలో ప్రతిపక్షాలను కూడా కలుపుకొని ముందుకుపోతుండటం విశేషం. అయితే, ఆర్టికల్ 370ని కేంద్రం లోని బీజేపీ సర్కార్ ఎట్టిపరిస్థితుల్లోనూ పునరుద్ధరించదని గ్రహించిన ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఈ విషయాన్ని వ్యూహాత్మకంగా పక్కనపెట్టేసింది.
ఆర్టికల్ 370 అంశాన్ని ప్రస్తావిస్తే అసలుకే ఎసరు వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తవానికి, రాష్ట్ర హోదా పునరుద్ధరణ అం శం రాజకీయ డిమాండ్ మాత్రమే కాదు, జమ్మూకశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా మారిపోయింది. ఇప్పటికే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్ని కలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ తిరిగి గాడిలో పడింది.
అందుకే రాష్ట్ర హోదా పునరుద్ధరణకు ఇదే సరైన సమయమని ఇటు ప్రజలు, అటు రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర హోదా పునరుద్ధరణతో ప్రజల కు మరింత బాధ్యతాయుతమైన పాలన అందుతుందని, ప్రజాస్వామ్య సంస్థలు మరింత బలోపేతమవుతాయన్న వారి వాదనను విస్మరించలేం. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో చూడాలి.






