విష్ణువుకు ప్రీతికరం తొలి ఏకాదశి
ఏడాదిలో హిందువుల పండుగులకు తొలి ఏకాదశి ఆరంభ పండుగ. భవిష్యోత్తర పురాణం ఈ పండుగ విశిష్టతను విపులీకరిస్తోంది. ఆషాఢ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఈ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి, పద్మ ఏకా దశి, మహా ఏకా దశి, దేవ శయన ఏకాదశి, శయన ఏకా దశి, పెద్ద ఏకా దశి, హరివాసర ఏకా దశి, హరి నయాని ఏకాదశి అనే పేర్లున్నాయి. భవిష్యోత్తర పురాణం ప్రకారం శ్రీమహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకా దశి నుంచి యోగ నిద్రలోకి వెళ్లి నాలుగు నెలలకు మేల్కొంటాడు.
ఈ నాలుగు మాసాలు శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనవి. ఆయన యోగనిద్రలో ఉండి కూడా చతుర్దశ భువనాల పురోభివృద్ధి గావిస్తాడు. ఆషాఢం నుంచి కార్తీక మాసం వరకు గల ఈ నాలుగు మాసాలను పవిత్ర చాతుర్మాసం అంటా రు. భూలోక ప్రజలకు కావాల్సిన వర్షాలను కురిపించి పంటలను సమృద్ధిగా పండించి పాడిపంటలతో సిరిసంపదలతో వర్ధిల్లజేయాలని ఇంద్ర, వరుణాది దేవతలకు ఆదేశమిచ్చి శ్రీమహావిష్ణు వు తపో దీక్షకు వెళ్లడమే తన యోగ నిద్ర మహత్తర లోక కల్యాణ కార్యమని పురాణీకులు చెబుతారు.
చాతుర్మాస్యంలో ఎవరైతే నిత్యం గోవిం ద నామస్మరణ చేస్తారో, భగవద్గీతను పఠిస్తారో, గోమాతను పూజిస్తారో, ఉపవాస దీక్ష లు చేస్తారో.. వారు శ్రీమహావిష్ణువు సన్నిదానానికి చేరుకొని, తద్వారా మోక్షాన్ని పొందుతా రని ప్రతీతి. అందుకే మునులు చాతుర్మాస దీక్షా దినాలు పవిత్రమైనవిగా నిర్ణయించారు. భక్తులు ఈ పవిత్ర నాలుగు మాసాల దినాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, పూ జాదికాలతో ఆచరించాలని నిర్దేశించారు.
కాగా నాలుగు మాసాల్లో వచ్చే ఏకా దశుల్లో ఇది మొదటిది కనుక దీనికి తొలి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఏడాదిలో అధిక మాసంతో పాటు వచ్చే అన్ని 26 ఏకా దశుల్లో ఉపవాసాలు ఉండకపోయినా చాతుర్మాసంలో వచ్చే 8 ఏకా దశుల్లో మాత్రం ఉపవాసం ఉంటే శ్రీమహావిష్ణువు కృపకు పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి. కాగా, చక్రవర్తి మాందాత రాజ్యంలో మూడేళ్ల పాటు వర్షాలు కురువక తీవ్ర కరువు కాటకాలు తాండవించాయి.
ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ ఆకలితో అలమటించారు. ఈ నేపథ్యంలో చక్రవర్తి అంగిరస మహర్షిని తరుణోపాయం గురించి ప్రార్థించాడు. దీంతో మహర్షి... ‘శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన చాతుర్మాస్యంలో ఏకాదశి వ్రతాన్ని నియమ, నిష్ఠలతో ఆచరించు! ఆస్వామి అనుగ్రహిస్తాడు! భూమండలాన్ని వరుణ దేవునితో వర్షం కురిపించి సస్యశ్యామలం గావిస్తాడు! తద్వారా పంటలు పండి సకల సంపదలతో ప్రజలు తులతూగుతారు!’ అని చెప్పాడు.
దీంతో మాందాత ఎంతో భక్తిప్రపత్తుడై, శాస్త్రయుక్తంగా ఉపవాస దీక్ష తో ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. అందుకు శ్రీమహావిష్ణువు ఎంతో సం తోషించి ఇంద్రుడు, వరుణాది దేవతలను ఆదేశించాడు. దీంతో వారు సమృద్ధిగా వర్షాలు కురిపించి ప్రజలకు కరువుకాటకాలు రాకుండా చేశారు. ఇలా ఏకాదశి వ్రత మహాత్మ్యం వల్ల మాందాత రాజ్యం సుభిక్షమైంది.
ఈ క్రమంలో ఆషాఢ ఏకాదశి రోజున మహిళలు, భక్తులు తమ ఇళ్లలో విష్ణువు, లక్ష్మీదేవిల విగ్రహాలకు షోడషోపచార పూజలను నిర్వహించడం, దాంతోపాటు ఏకాదశి వ్రతాన్ని జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఏడాదిలో వచ్చే 26 ఏకాదశులను భక్తులు గొప్ప పర్వ దినాలుగా కొలుస్తూ తరిస్తున్నారు.
చైత్ర మాసం శుక్ల, కృష్ణ పక్షాల్లో కామద ఏకాదశి, పాప విమోచన ఏకాదశి, వైశాఖంలో మోహినీ ఏకాదశి, వరూధినీ ఏకాదశి, జ్యేష్ఠంలో నిర్జుల ఏకాదశి, అపర ఏకాదశి, ఆషాఢంలో శయన ఏకాదశి (తొలి ఏకాదశి), యోగినీ ఏకాదశి, శ్రావణంలో పుత్రద ఏకాదశి, కామిక ఏకా దశి, భాద్రపదంలో పరివర్తన ఏకాదశి, ఆజ ఏకాదశి, ఆశ్వయుజంలో ఆశాయశ ఏకాదశి, ఇందిర ఏకాదశి, పుష్యంలో వచ్చే పుత్రద ఏకాదశి, సఫల ఏకాదశి, మాఘంలో వచ్చే జయ ఏకాదశి, షట్టిల ఏకాదశి, పాల్గుణంలో వచ్చే కమలక ఏకాదశి, విజయ ఏకాదశి, అధిక మాసంలో వచ్చే పద్మినీ ఏకాదశి, కమలా ఏకాదశిలను ఏడాదిలో భక్తులు పవిత్ర ఏకాదశి పర్వదినాలుగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటూ శ్రీమహావిష్ణువు కృపకు పాత్రులవుతున్నారు.
తాళ్లపల్లి యాదగిరిగౌడ్, 9949789939






