డిజిటల్ ఈహెచ్‌ఎస్‌తో భరోసా
ప్రభుత్వం అంటే ప్రజల జీవితాల్లో భరోసా నింపే ఒక వ్యవస్థ. ఆ భరోసాలో అత్యంత విలువైనది ఆరోగ్య భద్రత. ఓ ప్రభుత్వ ఉద్యోగి తన జీవితమంతా ప్రభుత్వ సేవకు అంకితం చేస్తూ నెలనెలా పన్నులు చెల్లిస్తాడు. పదవీ విరమణ తర్వాత కూడా తనకు, తన కుటుంబానికి అవసరమైన ఆరోగ్య రక్షణను ప్రభుత్వం కల్పిస్తుందనే నమ్మకంతో జీవిస్తాడు. ఆ నమ్మకానికి ప్రతీకగా రూపొందిన పథకం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్). ఆరోగ్య సేవలు ప్రత్యేక హక్కు కాదు, ప్రభుత్వ సేవ చేసిన వ్యక్తికి లభించాల్సిన గౌరవం అనే ఆలోచనతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య రక్షణ కోసం ఏర్పాటు చేసిన గొప్ప సంక్షేమ పథకం ఈహచ్‌ఎస్. అత్యవసర వైద్యం, శస్త్రచికిత్సలు, ప్రత్యేక వైద్య సేవలను ఆర్థిక భారం లేకుండా అందించడమే దీని ప్రధాన లక్ష్యం.
ఎంత గొప్ప సంక్షేమ పథకమైనా అమలులో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల విశ్వాసం లేకపోతే అది పూర్తి ప్రయోజనాన్ని అందుకోలేదు. ప్రభుత్వం చెల్లించే ప్రతి రూపాయి నిజంగా నాణ్యమైన వైద్య సేవకే వెళ్తుందా? రోగికి తనకు సేవలు అందించిన వైద్యుడి వివరాలు పూర్తిగా తెలుస్తున్నాయా? ఆరోగ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలు ఉన్నాయా? అని ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది.
కొన్నిచోట్ల ఈ పథకం అమలులో తీవ్ర లోపాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అర్హత కలిగిన నిపుణుల స్థానంలో అనుభవం లేని, సంబంధిత నైపుణ్యం లేని వైద్యులతో చికిత్స చేయించడం, రోగులకు సరైన సమాచారం ఇవ్వకుండా వైద్య సేవలు అందించడం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
రోగి పేరుగాంచిన ఆసుపత్రి లేదా డాక్ట ర్, నిర్దిష్ట నిపుణుడి వద్ద చికిత్స పొందుతున్నానని నమ్మి ఆసుపత్రికి వెళ్తాడు. ఆ డాక్టర్ పేరుతో ఉన్న లెటర్ హెడ్‌లో మరో డాక్టర్ చికిత్స చేయడం, అర్హత కలిగిన వైద్యుడి పేరుతో మరొకరు వైద్యం చేయ డం, లేదా రోగికి చూపించిన వైద్యుడికి బదులుగా వేరొకరు చికిత్స చేయడం చోటుచేసుకుంటే, అది వైద్య నైతికతకు, రోగి హక్కులకు, చట్టానికి వ్యతిరేకం.
శస్త్రచికిత్స లేదా చికిత్స సమయంలో వేరొక వ్యక్తి సేవలు అందిస్తే, అది రోగి విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఈహెచ్‌ఎస్ పథకం కింద ఆసుపత్రులకు ప్రభుత్వం ప్రజాధనాన్ని చెల్లిస్తుంది. కాబట్టి ప్రతి రూపాయి నిజాయితీతో వినియోగించాలి. అర్హత కలిగిన వైద్యుడి పేరుతో బిల్లులు సమర్పించి, వాస్తవానికి వేరొకరు సేవలు అందిస్తే, అది రోగికి అన్యాయం మాత్రమే కాదు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగంగా కూడా.
వైద్య సేవలపై విశ్వాసం
రోగి ఆసుపత్రికి వైద్యుడిపై నమ్మకంతో వెళ్తాడు. ఇందుకు వైద్యుడి అనుభవం, నైపుణ్యం, పేరు, ఇతర రోగుల అనుభవా లు అతని నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే వైద్య సేవల్లో విశ్వాసం అనే పదానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆ విశ్వాసాన్ని కాపాడాలంటే చికిత్స మాత్రమే కాదు, చికిత్సకు సంబంధించిన సమాచారం కూడా పారదర్శకంగా ఉండాలి.
ఒకప్పుడు వైద్యుడు చెప్పిందే తుది నిర్ణయం అనే భావన ఉండేది. ప్రపంచ ఆరోగ్య రంగంలో ఇప్పుడు రోగి కూడా చికిత్సలో భాగస్వామి. తనను ఎవరు పరీక్షించారో తెలుసుకోవడం, వైద్య రికార్డులు చికిత్స వివరాలు తెలుసుకోవడానికి, అవసరమైతే రెండో అభిప్రాయానికి, సందేహాలు అడిగి ఫిర్యాదు చేయడానికి రోగికి హక్కు కలిగి ఉంటాడు.
ఇవి మంచి వైద్య సేవలకు పునాది. ఆసుపత్రిలో అనేక మంది వైద్యులు కలిసి పని చేయడం సహజం. జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్లు, అసోసియేట్ కన్సల్టెంట్లు, సీనియర్ కన్సల్టెంట్లు అందరూ బృందంగా పనిచేస్తారు. కానీ, ఆ బృందంలో ఎవరు ఏ బాధ్యత నిర్వహించారో రోగికి తెలియజేయడం కూడా అంతే అవసరం. పరీక్షించిన వైద్యుడు ఒకరు, తుది నిర్ణయం తీసుకున్న నిపుణుడు మరొకరు అయితే అది రోగికి తెలియాలి. ఇందులో తప్పు లేదు.
మన దేశంలో ఏ ప్రభుత్వ పత్రానికైనా బాధ్యత వహించిన అధికారి పేరు ఉంటుం ది. కోర్టు తీర్పుపై న్యాయమూర్తి పేరు, రిజిస్ట్రేషన్ పత్రంపై నమోదు అధికారి పేరు, బ్యాంకు లావాదేవీలో బాధ్యత వహించిన ఉద్యోగి వివరాలు ఉంటాయి. రోగికి సహజంగా తనను పరీక్షించిన వైద్యుడు, చికిత్స పర్యవేక్షకుడు, శస్త్రచికిత్స జరిగితే బాధ్యుడు ఎవరు? తన వైద్య రికార్డులో ఈ వివరాలు నమోదయ్యాయా? అనే అనుమానాలు కలుగవచ్చు. కాబట్టి సాంకేతికతను వినియోగించి ప్రతి ఈహెచ్‌ఎస్ డిశ్చార్జ్ సమ్మరీపై క్యూఆర్ కోడ్ ఉంటే, దాన్ని స్కాన్ చేసిన వెంటనే చికిత్సకు సంబంధించిన ప్రాథమిక వివరాలు కనిపించాలి. పరీక్షించిన వైద్యుల వివరాలు, చికిత్స తేదీలు, సూచించిన మందులు, సూచనలు ఉంటే పేపర్ రికార్డులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. వైద్యుడు మారినా, ఆసుపత్రి మారినా, చికిత్స చరిత్ర సులభంగా అందుబాటులో ఉంటుంది.
ఈహెచ్‌ఎస్‌లో ప్రభుత్వం ఆసుపత్రులకు చెల్లించే డబ్బును చాలామంది ప్రభుత్వ ఖర్చుగా మాత్రమే చూస్తారు. కానీ, అది ప్రజల పన్నుల రూపంలో వచ్చిన నిధి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా పన్ను చెల్లింపుదారుడే. అందువల్ల ఈహెచ్‌ఎస్‌లో చెల్లించే ప్రతి పైసా ప్రజాధనమే. ప్రజాధనం వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆడిట్‌కు అనుకూలమైన రికార్డులు తప్పనిసరి చేయాలి. పారదర్శకత అనేది విశ్వసనీయతకు పునాది. స్పష్టమైన రికార్డులు ఉంటే నిజాయితీగా పనిచేసే ఆసుపత్రుల ప్రతిష్ట మరింత పెరుగుతుంది. మంచి వైద్యులు తమ సేవలకు తగిన గుర్తింపు, ప్రజల్లో విశ్వాసం పొందుతారు. రోగులు కూడా మరింత విశ్వాసంతో ఆ ఆసుపత్రులను ఎంచుకుంటారు.
అనేక దేశాల్లో రోగికి చికిత్స అనంతరం డిజిటల్ రికార్డులు అందుబాటులో ఉంటా యి. తనను పరీక్షించిన వైద్యుడి పేరు, చికిత్స వివరాలు, సూచించిన మందులు, తదుపరి అపాయింట్‌మెంట్ ఒకే చోట కనిపిస్తాయి. ఇది వైద్యసేవను మరింత బాధ్యతాయుతంగా మార్చడమే కాకుండా, భవిష్యత్తులో చికిత్స కొనసాగింపునకు కూడా ఉపయోగపడుతుంది. మన దేశంలో కూడా డిజిటల్ ఆరోగ్య రంగంలో మార్పు లు ప్రారంభమయ్యాయి. ఆయుష్మాన్ భారత డిజిటల్ మిషన్ వంటి కార్యక్రమా లు ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టిసారిస్తున్నాయి. ఇలాంటి మార్పులతో ఈహెచ్‌ఎస్ అనుసంధానమైతే ప్రభుత్వ ఉద్యోగులకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది.
హక్కుల బోర్డు ఉండాలి
ప్రతి ఈహెచ్‌ఎస్ ఎంప్యానెల్ ఆసుపత్రిలో స్పష్టంగా కనిపించే ప్రదేశంలో రోగి హక్కులు బోర్డు ఉండాలి. అందులో 1.పరీక్షించిన వైద్యుడి పేరు తెలుసుకునే హక్కు 2. మీ వైద్య రికార్డుల ప్రతులు పొందే హక్కు 3. చికిత్స గురించి వివరణ కోరే హక్కు 4. రెండో వైద్య అభిప్రాయం తీసుకునే హక్కు 5. ఫిర్యాదు చేసే హక్కు అని రాసి ఏర్పాటు చేయాలి. ఇవి సమాచార ప్రదర్శనలు కావు, రోగిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే సాధనాలు. ప్రభుత్వం ప్రతి చికిత్స తర్వాత అభిప్రాయ సేకరణ చేపట్టాలి. ఇద వ్యవస్థలో ఉన్న బలాలు, బలహీనతలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఫిర్యాదులు పెరగడం కంటే, ఫిర్యాదులను వినిపించే అవకాశం లేకపోవడమే ప్రమాదకరం.
ఈహెచ్‌ఎస్ ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు అండగా నిలుస్తున్న సంక్షేమ పథకం. అయితే కాలానుగుణ సంస్కరణలతో అది మరింత బలపడాలి. డిజిటల్ రికార్డులు, వైద్యుడి స్పష్టమైన గుర్తింపు, పారదర్శక బిల్లింగ్, రోగి అభిప్రాయానికి ప్రాధాన్యం, సమయపాలిత ఫిర్యాదు పరిష్కారం వంటి చర్యలు వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతాయి. ఈ మార్పులు ఈహెచ్‌ఎస్‌ను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో, విశ్వసనీయంగా తీర్చిదిద్దే సంస్కరణలు మాత్రమే తప్ప మరొకటి కావని గుర్తెరగాలి.
వ్యాసకర్త సెల్: 8466827118
దుప్పటి మొగిలి






