1 June, 2026 | 1:28 AM

జూన్ 2న బీసీలకు బీసీ బంధు పథకం పెట్టాలి

01-06-2026 12:57 AM
    1. ప్రతి కుటుంబానికి రూ.20 లక్షలు మంజూరు చేయాలి
  1. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, మే 31 (విజయక్రాంతి): జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు ‘బీసీ బందు పధకం‘ ప్రవేశ పెట్టి, ప్రతి బీసీ కుటుంబానికి రూ.20 లక్షలు ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. ఆదివారం విద్యానగర్లోని బీసీ భవన్‌లో జరిగిన14 బీసీ సంఘాల సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బిసి కులాల అభివృద్ధికి కూడా ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ బీసీ ‘బంధు పథకం‘ ప్రవేశపెట్టవలసిన అవసరం ఉందన్నారు. బీసీ కులాలలో చాలా కులాలు అత్యంత వెనుకబడిన కులాలు  ఉన్నాయని,  స్వాతంత్రం సిద్ధించి  75 సంవత్సరాలు గడిచిన వీరి కుల వృత్తులు దెబ్బ తిన్నాయన్నారు. వీరి బ్రతుకులలో ఎలాంటి గుణాత్మకమైన, పరిమాణాత్మకమైన అభివృద్ధి జరగలేదన్నారు.

పైగా గత 13 సంవత్సరాల తెలంగాణ పాలనలో ఒక్క బీసీకి కూడా సబ్సిడీ రుణాలు మంజూరు చేయలేదన్నారు. రెండుసార్లు 2015లో 3 లక్షల 62 వేల దరఖాస్తులు తీసుకున్నారు. కానీ రుణాలు మంజూరు చేయలేదన్నారు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2022లో మరోసారి సబ్సిడీ రుణాలు ఇస్తామని 5 లక్షల 77 వేల దరఖాస్తులు తీసుకున్నారన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2024 లో మరోసారి 6 లక్షల 80 వేల దరఖాస్తు తీసుకున్నారని, కాని రుణాలు మంజూరు చేయలేదన్నారు.

అదే విధంగా పెండింగ్లో ఉన్న10 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు నీల వెంకటేష్ ముదిరాజ్,  పగిళ్ల సతీష్ కుమార్, జి. అనంతయ్య, సి. రాజేందర్, పల్లగుర్ల రాందేవ్ మోడీ, చిక్కుడు బాలయ్య,  నిఖిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.