calender_icon.png 14 January, 2026 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలోని జంక్షన్ల సుందరీకరణ పనులు వేగవంతం చేయాలి

14-01-2026 12:32:35 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్ జనవరి 13 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గోకుల్ నగర్ జంక్షన్లో జంక్షన్ ల సుందరీకరణ, ట్రాఫిక్ నిర్వహణ, వర్షాకాలంలో వరదల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంజనీరింగ్, విద్యుత్తు శాఖ, టౌన్ ప్లానింగ్, పోలీస్ శాఖ అధికారులతో కలిసి జంక్షన్ పరిసరాల పరిస్థితులను సమీక్షించారు.

ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ పనితీరు, ట్రాఫిక్ రద్దీకి కారణాలు, వర్షాకాలంలో వరద నీరు రోడ్లపైకి చేరకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై విస్తృతంగా చర్చించారు. నాలాల వెడల్పు తక్కువగా ఉండటం వల్ల రోడ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు వివరించగా, దీనికి శాశ్వత పరిష్కారం దిశగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే సూచించారు.

నగరంలోని ప్రధాన జంక్షన్లన్నింటిలోనూ ట్రాఫిక్ సమస్యలు, వరద నీటి నిల్వలు పునరావృతం కాకుండా ఆధునిక సాంకేతిక చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఫలితాలు కనిపించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో వేగంగా పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాయిని 

భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండగ రైతుల కష్టానికి ప్రతీకగా నిలిచే పండుగని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని భగవంతుని కోరారు. గ్రామీణ, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ఐక్యతతో పండుగ జరుపుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇ.వి. శ్రీనివాస్ రావు, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, డివిజన్ అధ్యక్షులు బంక సతీష్, నాయకులు నాయిని లక్ష్మా రెడ్డి, అశ్విన్ రాథోడ్, మండల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.