గత ఎన్నికల సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్ తీరు..
గతంలో లోక్‌సభ ఎన్నికలు జరిగిన సంవత్సరాల్లో ప్రధాన స్టాక్ సూచి నిఫ్టీ ఆసక్తికరమైన ట్రెండ్స్‌ను ప్రదర్శించింది. 2000 నుంచి ఇప్పటివరకూ అన్ని లోక్‌సభ ఎన్నికల సంవత్సరాలను చూస్తే..ఎన్నికలు జరిగే ముందు ఒక నెలలో మాత్రమే (2004) నిఫ్టీ నష్టపోయిందని చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ నరేశ్ బుల్‌చందాని చెప్పారు. 2004లో మినహా 2009, 2014, 2019 ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు మూడు నెలల్లోనూ నిఫ్టీ రాబడుల్నే ఇచ్చిందన్నారు. దాదాపు ప్రతీ ఎన్నికల సందర్భంలోనూ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుంటుంది.
ఎన్నికలు ముగిసిన తర్వాత నెల నుంచి ఆరు నెలలలోపు స్థిరపడుతుందని స్టాక్స్‌బాక్స్ రీసెర్చ్ హెడ్ మనీశ్ చౌదరి తెలిపారు. ఒక్కోసారి ఎన్నికలకు ముందు ఆరు నెలలపాటు అప్‌ట్రెండ్ సాగించి రెండంకెల లాభాల్ని కూడా అందిస్తుంది. ఉదాహరణకు 2004 ఎన్నికలకు ముందు ఆరునెలల కాలంలో నిఫ్టీ 12.52 శాతం పెరిగిందని ఎస్‌బీఐ సెక్యూరిటీస్ రిపోర్ట్ పేర్కొంది. 2009 ఎన్నికలకు ముందు నిఫ్టీ సూచి 30.65 శాతం పెరగడమే కాకుండా, ఎన్నికల తర్వాత సైతం లాభాల్ని మరింతగా ఇచ్చింది.







