సంకీర్ణ ప్రభుత్వ హయాంలో రాబడులొస్తాయా?
కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం భాగస్వామ్య పక్షాల మద్దతుతో ఏర్పడుతున్నది. గత రెండు టెర్మ్‌ల్లో బీజేపీ పూర్తి మెజారిటీతో ఏర్పడిన ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో ఒకటి, రెండు సందర్భాల్లో (పెద్ద నోట్ల రద్దు, కొవిడ్ సంక్షోభం) తప్ప ఇన్వెస్టర్లు వారి పెట్టుబడులపై భరోసాగా ఉన్నారు. మంచి రాబడులనే అందుకున్నారు. కానీ తాజాగా నరేంద్ర మోదీ సొంతపార్టీ బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు. ఇతర పక్షాల సాయంతో ప్రభుత్వం ఏర్పాటవుతున్నది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే విధానాలను పాటించడం కష్టమవుతుందని, ఆర్థిక సంస్కరణలకు నీళ్ళొదులుతుందన్న భయాలు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో కొంత ఆందోళన నెలకొన్నది. జూన్ 4న లోక్‌సభ ఫలితాలు వెలువడిన రోజున మార్కెట్ భారీ పతనాన్నే చవిచూసింది. దీనితో యువ మదుపరుల్లో ఆందోళన సహజమే. ఈ తరహా ఒడిదుడుకులు మార్కెట్లో కొనసాగుతాయా? మార్కెట్లో పెట్టుబడి చేసిన, చేయబోయే మీ కష్టార్జితం ఎన్‌డీఏ 3.0 హయాంలో ఎలా ఉంటుంది? మీ పొదుపును ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు...వేటిలో ఇన్వెస్ట్ చేయాలి అన్న సందేహాలు నివృత్తి చేసేందుకు కొన్ని సమాధానాలివిగో...
ఎన్నికల తర్వాత ఆరు నెలలు రాబడులు ఇచ్చిన సందర్భాలు
ఎన్నికలు జరిగిన తర్వాత ఆరు నెలలు స్టాక్ మార్కెట్ మంచి పనితీరును ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి. 2004 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నెలరోజుల్లో నిఫ్టీ నష్టాల్ని తీసుకొచ్చింది. అయితే అటుతర్వాత ఐదు నెలల్లో ఆ నష్టాలను రికవరీ చేసుకున్నది. మొత్తం ఆరు నెలల్లో 3.51 శాతం రాబడుల్ని అందించింది. 2009లో యూపీఏ ప్రభుత్వం నేతృత్వంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఆరు నెలల్లో నిఫ్టీ భారీగా 37.70 శాతం లాభాల్ని తెచ్చిపెట్టింది. ఎన్నికలకు ముందు ఆరు నెలలు, తర్వాత ఆరు నెలల్లో (మొత్తం ఒక సంవత్సరం) మార్కెట్లు సగటున 43.2 శాతం రాబడుల్ని అందించాయని ధన్‌ఇన్వెస్టర్ సీఈవో అనూషా సోహమ్ భత్వాల్ చెప్పారు.
యూపీఏ.. ఎన్‌డీఏ.. ఏ ప్రభుత్వమైనా మార్కెట్‌కు నష్టం తెస్తుందా?
ఐదేండ్ల కాలపరిమితిని పరిశీలిస్తే యూపీఏ 1 (2004 నుంచి 2009 వరకూ) హయాంలో నిఫ్టీ దాదాపు 115 శాతం పెరిగింది. యూపీఏ 2 (2009 నుంచి 2014 వరకూ) హయాంలో 94 శాతం రాబడుల్ని ఇచ్చినట్టు ఎస్‌బీఐ సెక్యూరిటీస్ రిపోర్ట్‌లో వివరించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 1, ఎన్‌డీఏ 2 అధికారంలో ఉన్న కాలంలో మార్కెట్ వరుసగా 62 శాతం, 88 శాతం చొప్పున రాబడుల్ని అందించిందని బుల్‌చందాని వెల్లడించారు. గత 20 ఏండ్ల గణాంకాల ప్రకారం ఏ పార్టీలు, సంకీర్ణాలు అధికార పగ్గాలు చేపట్టినా మార్కెట్లు కార్పొరేట్ల లాభాలకు అనుగుణమైన బాటలోనే నడుస్తుంటాయన్నారు. ‘ప్రభుత్వాన్ని ఏ రాజకీయ పార్టీ నడుపుతుందనేది మార్కెట్లకు పెద్ద ముఖ్యం కాదు. ప్రభుత్వం స్థిరంగా ఉన్నదా? వృద్ధి ఆధారిత విధానాలను అవలంబిస్తున్నదా అన్న అంశాలనే ఇన్వెస్టర్లు చూస్తారు. భారత ఆర్థిక వ్యవస్థకు అంతర్గతంగా వృద్ధిచెందే బలం ఉన్నది. ఇందుకు అధికారంలో ఉన్న ప్రభుత్వం మద్దతు ఉంటే చాలు’ అని ఆనంద్‌రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ నరేంద్ర సోలంకి చెప్పారు. భారత రాజకీయ వ్యవస్థ కూడా పరిణితి చెందిందని, వివిధ ప్రభుత్వాల మధ్య, వివిధ ప్రధాన మంత్రుల పాలన మధ్య సైద్ధాంతిక విబేధాలు ఉన్నప్పటికీ, 1991 నుంచి గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన ప్రధాన విధానా సంస్కరణలు వెనక్కు పోలేదని సోలంకి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సంస్కరణల కొనసాగింపుపై ఆందోళన అవసరం లేదన్నారు.






