బెంగళూరు తొక్కిసలాట ఘటన దురదృష్టకరం: కిషన్ రెడ్డి
హైదరాబాద్: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమే కారణమని తెలిపారు. స్టేడియం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసి కూడా తగిన ఏర్పాట్లు చేయకపోవడం దారుణమని కిషన్ రెడ్డి ఆరోపించారు. అభిమానులను నియంత్రించలేక పోయామని కర్ణాటక రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah), డిప్యూటి సీఎం డి.కె. శివకుమార్ ప్రకటించడం వారి చేతకాని తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతించాలని కిషన్ రెడ్డి కోరుకున్నారు. ఈ ఘటనలో గాయలపాలైన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






