12 August, 2026 | 2:02 PM

రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్ లేదు

12-08-2026 12:48 AM

ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ 

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి) : తెలంగాణ విభజనను, అస్థిత్వాన్ని హేళన చేసిన బీజేపీకి తెలంగాణలో భవిష్యత్ లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ విమర్శించారు, 12 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన మోసాలపై జనం తిరగబడుతున్నారని, జెన్ జీ దెబ్బకు ఢిల్లీలో మీ ప్రధాని, హోం మంత్రికే దిక్కులేకుండా పోయిందనే విషయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు.

మంగళవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఇక బీజేపీ పని ఖతమేనని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తప్పుగా మాట్లాడిన బీజేపీ తెలంగాణ నేతలు ఖండించలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర  విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు, ఎంపీలు, కేంద్రంపై ఎందుకు మాట్లాడటం లేదని బల్మూరు వెంకట్ నిలదీశారు.