calender_icon.png 4 February, 2026 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంఖ్యలకే బడ్జెట్ పరిమితం!

01-02-2026 12:00:00 AM

బందారపు నర్సయ్య గౌడ్ :

తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే మన నీళ్లు, నిధులు మనకు దక్కుతాయని, మన బిడ్డల చదువులు, మన కుటుంబాల ఆరోగ్యం మెరుగుపడుతుంద ని ఆశించిన సామాన్యుడికి నిరాశే మిగులుతోంది. బడ్జెట్ ప్రసంగాల్లో వేల కోట్లు కేటాయిస్తున్నామని గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తున్న పాలకులు, తీరా ఆ నిధులను ఖర్చు చేయడంలో మాత్రం దారుణమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాలను పరిశీలిస్తే, విద్య, వైద్య రంగాల్లో ఈ పాలకుల చిత్తశుద్ధి ఎంతటిదో బట్టబయ లవుతోంది.

బడ్జెట్ అంటే సంఖ్యలు మాట్లాడతాయని అంటారు. కానీ, బడ్జెట్‌లో అస లు మాట్లాడేది సంఖ్యలు కావు, ఎంపికలు. ఎక్కడ ఖర్చు పెరిగింది? ఎక్కడ తగ్గింది? ఏ సమస్యలను కప్పిపుచ్చారు? ఏ వర్గాలను మౌనంగా విస్మరించారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికినప్పుడే బడ్జెట్ అసలు రాజకీయ స్వరూపం బయటపడుతుంది. ప్రభుత్వాలు బడ్జెట్‌ను ఎప్పుడూ వృద్ధి, విశ్వాసం, స్థిరత్వం వంటి పదాలతో నిర్వచించడానికి ప్రయత్నిస్తాయి. కానీ ఆ పదాలు నిజ జీవితంలో కి ఎలా అనువదించబడుతున్నాయన్నదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కనిపెట్టాల్సిన అవసరముంది.

పొదుపు పేరుతో మిగులు!

బడ్జెట్‌ను చదవడం అంటే అంకెలను లెక్కించడం కాదు, ఎంపికలను గుర్తించడం. ఒక వైపు పన్ను రాయితీలు, పన్నుల భారాలు ఉంటాయి. మరొకవైపు కార్పొరేట్ రక్షణ, సంక్షేమం, ఉపాధి కుదింపు, ప్రజా సేవలపై ఖర్చు తగ్గింపు, ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, ప్రయివేటీకరణ.. ఇవన్నీ యాదృచ్ఛిక నిర్ణయాలు కా వు.. ఒక నిర్దిష్ట ఆర్థిక దృష్టికోణానికి చెంది న స్పష్టమైన ఎంపికలు. ఏ రంగానికి ఎంత కేటాయించాలన్న దానికంటే, ఏ రంగాన్ని ఎంత నిర్లక్ష్యం చేయాలన్నదే ఇప్పటి బడ్జెట్ ఆకాంక్షలా కనిపిస్తుంది.

ఇటీవలి బడ్జెట్ పత్రాలను పరిశీలిస్తే ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో మందుల కొరత, శస్త్ర చికిత్స సామగ్రి లేక పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయకుండా పొదుపు పేరుతో వెన క్కి తీసుకోవడం శోచనీయం. 2023--24 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులు, మందుల కొనుగోలు కోసం రూ.377.43 కోట్లు కేటాయించింది.

అయితే వాస్తవం గా ఖర్చు చేసింది కేవలం రూ. 283.08 కోట్లు మాత్రమే. అంటే సుమారు రూ. 94.36 కోట్లను ప్రజల ఆరోగ్యానికి ఖర్చు చేయకుండా ప్రభుత్వం తన ఖజానాలో మిగుల్చుకుంది. ఇక బీఆర్‌ఎస్ ప్రభుత్వ హమాయంలో 2018--19లో లైఫ్ సేవిం గ్ మెడిసిన్స్ కోసం రూ.12 కోట్లు కేటాయిస్తే, వాడింది కేవలం రూ. 2.23 కోట్లు మాత్రమే. అదే ఏడాది మొత్తం బడ్జెట్‌లో రూ. 280.45 కోట్ల నిధులు ఖర్చు చేయకుండా వదిలేశారు.

ఆపరేషన్లు, ఇతరత్రా అవసరమయ్యే పరికరాల కోసం బడ్జెట్‌లో వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నప్పటికీ వాస్తవ రూపం వచ్చేసరికి వాటికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మొత్తం నిధులను వెనక్కి మళ్లిస్తున్నారు. 2023- సర్జికల్ సామాగ్రి కోసం ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో రూ. 21.64 కోట్లు పొదుపు పేరుతో మిగుల్చుకోవడం గమనార్హం.

విద్యారంగంపై వివక్ష..

విద్యా రంగానికి సంబంధించి బడ్జెట్ కాగితాల్లో భారీ మొత్తాలను చూపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రతి ఏటా వందల కోట్లు ఖర్చు కావడం లేదు. 2024-25లో విద్యా రంగానికి రూ. 22 వేల కోట్లకు పైగా కేటాయించగా, వాస్తవ వ్యయం మాత్రం రూ. 21 వేల కోట్లు మాత్రమే ఉంది. అంటే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఖర్చు చేయకుండా వెనక్కి తీసుకోవడం జరిగింది.

పాఠశాల విద్యాశాఖలో సమగ్ర శిక్ష, మధ్యాహ్న భోజన పథకాలకు కేటాయించే నిధుల్లో ప్రతి ఏటా 15 నుంచి 25 శాతం వరకు కోత పడుతూనే ఉన్నది. ఇది విద్యార్థులకు అందాల్సిన కనీస సౌకర్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉన్నత, సాంకేతిక విద్యా విభాగాల్లో ప్రతి ఏటా సుమారు 30 నుంచి 50 శాతం నిధులు పొదుపు పే రుతో ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నది.

అందని సంక్షేమం..

రాష్ట్రంలో మాతా,శిశు ఆరోగ్యం కోసం ఉద్దేశించిన పథకాల్లో నిధులు దారుణంగా పక్కదారి పడుతున్నాయి. 2023--24 బడ్జెట్‌లో అమ్మ ఒడి (కేసీఆర్ కిట్) కోసం రూ. 329.93 కోట్లు కేటాయించగా, ఖర్చు చేసింది కేవలం రూ. 3.84 కోట్లు మా త్రమే. అంటే దాదాపు 98 శాతం నిధులను ప్రభుత్వం ఖర్చు చేయలేదు. అదే ఏడాది న్యూట్రిషన్ కిట్ కోసం కేటాయించిన రూ. 150.94 కోట్లలో ఒక్క రూపా యి కూడా ఖర్చు చేయకుండా మొత్తం నిధులను వెనక్కి తీసుకున్నారు.

ఇక ఇప్పుడు అధికారంలోకి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది వైద్యారోగ్య రంగానికి 12,393 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ అందులో ఎంత మేర ఖర్చు పెట్టిం దనే విషయాలను ప్రభుత్వం బయటపెడితే బాగుంటుంది. ప్రజా కాంక్ష మేరకు బడ్జెట్ రూపొందించాల్సిన అవసముంటుంది. బడ్జెట్‌లో కేటాయించిన ప్రతి పైసాను ప్రజల కోసం ఖర్చు చేసినప్పుడే నిజమైన సంక్షేమం సాధ్యమవుతుంది. ప్రతీ బడ్జెట్‌లో విద్యా రంగానికి విధిగా 15 శాతం నిధులను కేటాయించాలి. ప్రజల ఆరోగ్య భద్రత కోసం బడ్జెట్‌లో 10 శాతం కేటాయింపులు కచ్చితంగా ఉండాలి.

శ్వేతపత్రం అవసరం..

 ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్ సామాగ్రి కొరత లేకుండా చూసుకోవాలి. పొదుపు పేరుతో నిధులను వెన క్కి తీసుకోవడం ఆపాలి. నిధులు మిగిల్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు, అవి ఖర్చు కాకపోవడం వల్ల సామాన్యుడికి జరుగుతున్న నష్టాన్ని వివరించడమే గాక దానికి బాధ్యత వహించాలి. ప్రతి ఆరు నెలలకోసారి విద్యా, వైద్యనిధుల ఖర్చుపై శ్వేతపత్రం తప్పనిసరిగా విడుదల చేయా లి.

ఇప్పటికైనా అంకెల్లో మాయాజాలం ఆపండి. ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తుపై నిర్లక్ష్యం వహిస్తే తెలం గాణ సమాజం క్షమించదు. రాబోయే బడ్జెట్‌లోనైనా బడుగు, బలహీన వర్గాల కోసం చిత్తశుద్ధితో బడ్జెట్‌లో నిధులు కేటాయించి, ఖర్చు చేయాలని కోరుతున్నాం.