24 April, 2026 | 10:54 AM

2025లోనూ బిగ్ ఐపీవోల సందడి!

31-12-2024 12:40 AM

ముంబయి: స్టాక్ మార్కెట్లో ఈ ఏడాది అనేక పబ్లిక్ ఇష్యూలు (ఐపీవోలు) సందడి చేశాయి. ఏడాది మొదలుకొని.. క్యాలెండర్ సంవత్సరం చివరివారం వరకు చిన్నా, పెద్దా ఐపీవోలు వస్తూనే ఉన్నాయి. ఇలా ఐపీవోల ద్వారా కంపెనీలు సమీకరించిన మొత్తం రూ.1.62 లక్షల కోట్ల పైనే. వీటికి క్వాలిఫైడ్ ఇన్స్‌స్ట్టిట్యూషనల్ పేస్‌మెంట్స్ (క్యూఐపీ), రైట్స్ ఇష్యూలు అదనం.

ఇవన్నీ కలుపుకొంటే ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్ల నుంచి కంపెనీలు సమీకరించిన మొత్తం అక్షరాలా రూ.3 లక్షల కోట్లు దాటింది. ఈ ఒరవడి వచ్చే ఏడాదీ కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పేరు మోసిన కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.

2024లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, స్విగ్గీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీనీలు మార్కెట్ నుంచి నిధులు సమీకరించాయి. దాదాపు 90 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి.

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ రూ.27,870 కోట్ల ఐపీవో ఈ ఏడాది అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచింది. 2022లో వచ్చిన ఎల్‌ఐసీ ఐపీవోను (రూ.20,557 కోట్లు) దాటేసి అతిపెద్ద ఐపీవో రికార్డును నెలకొల్పింది. వచ్చే ఏడాది ఈ రికార్డ్ అధిగమించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కొత్త ఏడాదిలోనూ..

2025లో పేరు మోసిన కంపెనీలు ఐపీవోకు రానున్నాయి. అందులో దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా విభాగం ఒకటి. 15 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఐపీవోకు రానున్నట్లు సమాచారం.

వాల్‌మార్టుకు చెందిన ఈ -కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌సైతం వచ్చే ఏడాది ఐపీవోకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా తన హోల్డింగ్ కంపెనీని సింగపూర్ నుంచి భారత్‌కు తరలించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.

ఇప్పటికే మార్కెట్లో లిస్టయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హీరో మోటోకార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, మణప్పురం ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్, కెనరా బ్యాంక్, గ్రీవ్స్ కాటన్‌కు చెందిన అనుబంధ సంస్థలు కూడా 2025లో ఐపీవోకు రానున్నాయి.

గ్రీవ్స్ కాటన్ కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహన విభాగం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీని ఐపీఓకు తీసుకొచ్చేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సైతం తన ఎన్‌బీఎఫ్‌సీవిభాగం హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను లిస్ట్ చేసేందుకు బోర్డు ఓకే చెప్పింది.

బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ హోటల్ వెంచర్స్, హీరో మోటోకార్ప్స్‌కు చెందిన హీరో ఫిన్‌కార్ప్, కెనరా బ్యాంక్‌కు చెందిన మ్యూచువల్ ఫండ్స్ విభాగం కెనరా రెబొకో వంటివి ఐపీవోకు రానున్నాయి.

దేశీయగా అతిపెద్ద కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ కూడా తమ అనుబంధ కంపెనీలైన జియో, టాటా పాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీల ఐపీవోలు సైతం వచ్చే ఏడాదే రానున్నాయి. ముఖ్యంగా జియో ఐపీవో 2025లో అతిపెద్ద ఐపీవోగా నిలిచే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

  ఈ ఐపీవో హ్యుందాయ్ పేరిట ఉన్న రికార్డును చెరిపేసే అవకాశం ఉందనేది మార్కెట్ వర్గాలు చెప్తున్నమాట. మార్కెట్ పరిస్థితులు అనుకూలిస్తే వీటితో పాటు మరిన్ని కంపెనీలు పబ్లిక్ ఇష్యూల కోసం క్యూ కట్టొచ్చు.