స్పీకర్ గడ్డం ప్రసాద్కు ‘హోం’ శాఖ?
కాంగ్రెస్ కేబినెట్ విస్తరణలో ఊహించని మలుపులంటూ ప్రచారం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఎట్టకేలకు దక్కనున్న ప్రాతినిథ్యం
ఢిల్లీ వేదికగా మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో స్పీకర్ భేటీ..
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధిష్టానం?
రంగంలోకి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
హీటెక్కిన తాండూరు, పరిగి, షాద్‌నగర్ ఎమ్మెల్యేల లాబీయింగ్
రంగారెడ్డి/వికారాబాద్ జూన్2 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేబినెట్ విస్తరణ తుది అంకానికి చేరుకుంది. ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో, ఖాళీలను భర్తీ చేయడంతో పాటు భారీ మార్పులు-చేర్పులకు హైకమాండ్ కసరత్తు ముమ్మరం చేసింది.
అయితే, ఈసారి కేబినెట్ విస్తరణలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం.. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రివర్గంలోకి రానుండటం. ఆయనకు అత్యంత కీలకమైన హోం శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఢిల్లీ వేదికగా మారిన సమీకరణాలు..
గత వారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనే చర్చ నడుస్తోంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన.. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించడంతో పాటు తనకు మంత్రి పదవి ఇవ్వా లని కోరినట్లు సమాచారం. స్పీకర్ లాంటి ఉన్నత రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నేతను కేబినెట్లోకి తీసుకుంటే సాధారణ శాఖలు ఇవ్వడం సరికాదని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్న హోం శాఖను ఆయనకు అప్పగించేందుకు రాహుల్ గాంధీ సా నుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీరనున్న ‘మంత్రి’ లోటు
తొలి విడత కేబినెట్ కూర్పులో రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా దక్కలేదు. దీంతో ఈసారి విస్తరణలో రంగారెడ్డి జిల్లా కు పెద్దపీట వేయడం ఖాయంగా కనిపిస్తోం ది. అయితే, ఇదే జిల్లాకు చెందిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రి పదవికి తమ వం తు ప్రయత్నాలు లాబీయింగ్ తీవ్రం చేశారు.
ముందంజలో మల్రెడ్డి రంగారెడ్డి..
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి జిల్లా కోటాలో మంత్రి పదవి కోసం మొదటి నుంచి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సీనియారిటీ పరంగా, కష్టకాలంలో పార్టీ జెండా మోసిన నేతగా తనకు అవకాశం ఇవ్వాలని ఆయన ఇప్పటికే ఢిల్లీ వేదికగా అధిష్టాన పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు. రేసులో పరిగి, తాండూరు, షాద్నగర్ ఎమ్మెల్యేలు కూడా పోటీ పడుతున్నారు.పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సైతం ఢిల్లీలోనే మకాం వేసి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరితో పాటు తాండూరు, షాద్నగర్ ఎమ్మెల్యేలు కూడా సామాజికవర్గాల సమీకరణాల ప్రకారం తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
గడ్డం ప్రసాద్ వైపే అధిష్టానం మొగ్గు ఎందుకు?..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిల మధ్య గట్టి పోటీ నెలకొనడం.. అటు ఇప్పటికే కేబినెట్లో రెడ్డి సామాజికవర్గ ప్రాధాన్యత ఎక్కువగా ఉందనే విమర్శలు ఉండటంతో అధిష్టానం సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది.
సామాజిక సమతుల్యత..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎస్సీ (మాల ) సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ను కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా అటు జిల్లాకు న్యాయం చేసినట్లవుతుంది, ఇటు సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా విమర్శలకు అడ్డుకట్ట వేయవచ్చని కాంగ్రెస్ సీనియర్ల విశ్లేషణ.జూన్ రెండో వారంలో ఏఐసీసీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో తుది సమావేశం నిర్వహించి ఈ జాబితానుఖరారుచేయనున్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు ఒకవేళ ప్రచారమే నిజమై గడ్డం ప్రసాద్కు ‘హోం’ శాఖ దక్కితే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలుకావడం ఖాయం.






