13 May, 2026 | 1:32 AM

నీట్ రద్దు సిగ్గు చేటు

13-05-2026 12:00 AM
  1. విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం
  2. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలి
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): నీట్ ప్రశ్న పత్రం లీకై ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం సిగ్గు చేటని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్- కేటీఆర్ విమర్శించారు. పగలూరాత్రి కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందని పేర్కొన్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహిం చడం చేతకాని కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి పేపర్ లీకైందన్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపై కేటీఆర్ మంగళవారం స్పందించారు.

2024లోనూ నీట్ ప్రశ్న పత్రం లీకైన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైందని తెలిపా రు. జాతీయ అర్హత పరీక్ష నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న ఈ అసమర్థత.. విద్యార్థుల పట్ల శాపంగా మారిందని విమర్శించారు. ఏకంగా వందకు పైగా ప్రశ్న లు పరీక్షకు ముందు రోజే లీక్ కావడం వ్యవస్థలో ఉన్న దారుణమైన లోపాలను బయటపెట్టిందని, దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కేంద్ర సర్కారు తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందన్నారు.

ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. దీని వెనక ఎంత పెద్దవాళ్ల హస్తం ఉన్నా, వాళ్లందరినీ పట్టుకుని కఠినంగా శిక్షించా లి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్నారు. సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బం దీగా నిర్వహించాలని కోరారు. నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణచెప్పాలని డిమాండ్ చేశారు.