13 May, 2026 | 1:31 AM

తేలనున్న లెక్కలు..!

13-05-2026 12:00 AM

మొదలైన ఇంటింటి జనగణన

ఇళ్ల వద్దకు ఎన్యూమరేటర్లు

33 ప్రశ్నలతో కూడిన సమాచారం సేకరణ

డిజిటల్ విధానంలో ప్రత్యేక యాప్‌లో నమోదు

పటాన్‌చెరు, మే 12: జాతీయ జనగణనలో భాగంగా తొలివిడతగా గృహాల లెక్కింపునకు రంగం సిద్దమైంది. మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ జూన్ 9 వరకు కొనసాగనుంది. ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ ని ఇంటింటికీ వెళ్లి 33 ప్రశ్నలతో కూడిన సమాచారం సేకరించనున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో చేపడుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో విడతలో భాగంగా జనగణనను లెక్కించనున్నారు.

200 ఇళ్లకో ఎన్యూమరేటర్..

గృహాల జాబితా సేకరించేందుకు మంగళవారం నుంచి ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. 200 ఇళ్లకు ఒకరు చొప్పున కేటాయించారు. అరుగురు చేసిన గణన వివరాలు పర్యవేక్షించేందుకు ఒక సూపర్వైజర్ను నియమించారు. ఇప్పటికే వారికి మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ అందించారు. ఎన్యూమరేటర్ తమ సెల్ఫోన్లో సెన్సెస్ 2027 యాప్ డౌన్లోడ్ చేసుకుని సేకరించిన వివరాలను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది.

33 ప్రశ్నలతో సమాచారం సేకరణ..

ఇళ్ల జాబితా, గృహ గణనలో భాగంగా ఎన్యూమరేటర్లు 33 ప్రశ్నలతో కూడిన సమాచారం సేకరించనున్నారు. భవనం నంబర్ (మున్సిపల్, గ్రామం వారీగా), ఇంటి నంబర్, ఇంటినేల, గోడలు, పైకప్పు తయారీకి ఉపయోగించిన ప్రధాన పదార్థం, ఇంటి వినియోగం, ఇంటి పరిస్థితి, కుటుంబ క్రమసంఖ్య, ఫ్యామిలీలో నివసించే వ్యక్తులు, యజమాని పేరు, లింగం, కులం, ఇల్లు (సొంతమా/అద్దెనా), అందుబాటులో ఉన్న గదులు, నివసిస్తున్న వివాహిత జంటలు, తాగునీటి ప్రధాన వనరు, లభ్యత, వెలుతురు ప్రధాన వనరు, మరు గుదొడ్డి సౌకర్యం, రకం, నీటిపారుదల వ్యవస్థ, స్నానపు గది సౌకర్యం, వంట గది ఎల్పీజీ/పీఎన్జీ కనెక్షన్, వంట కోసం వినియోగించే ప్రధాన ఇంధనం, రేడియా, ట్రాన్సిస్టర్, టెలివిజన్, ఇంటర్నెట్, ల్యాప్టాప్, కంప్యూటర్, టెలిఫోన్, మొబై ల్ఫోన్, స్మార్ట్ఫోన్, సైకిల్, స్కూటర్, మోటర్ సైకిల్, మోపెడ్, కారు, జీవు, వ్యాన్, కుటుంబం ప్రధానంగా వినియోగించే ధాన్యాలు, మొబైల్ నెంబర్ వంటి 33 రకాల ప్రశ్నాలతో కూడిన సమాచారం సేకరించనున్నారు.

ఈ వివరాలను మౌఖికంగా చెబితే సరిపోతుందని ఎన్యూమరేటర్లకు ఆధార్, పాన్, బ్యాంకు అకౌంట్ పాస్బుక్ వంటి ధ్రువీకర ణ పత్రాలను చూపించాల్సిన, ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు.

సందేహాలుంటే...

జనగణన పేరిట కొంతమంది ఆకతాయిలు, దుండగులు ఇళ్ళ వద్దకు వచ్చి దోపిడీ, దొంగతనాలు వంటి వాటితో మోసగించే ప్రమాదముంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు. గణనకు వచ్చే వారు ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారు. వీరు విధిగా ఐడీ కార్డు ధరించి ఉంటారు. ఎవరికై నా అనుమానం కలిగితే ఐడీ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సదరు ఉద్యోగి పేరు, వివరాలు ఇట్టే తెలిసిపోతాయని అధికారులు పేర్కొంటున్నారు.