2 May, 2026 | 6:34 PM

జనగణన పకడ్బందీగా జరగాలి

12-03-2026 01:28 AM
  1. రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి
  2. సమగ్ర డేటాతోనే ప్రజాస్వామ్యం బలోపేతం
  3. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
  4. జీహెచ్‌ఎంసీలో ఛార్జ్ సెన్సస్ అధికారులకు మూడు రోజుల శిక్షణ ప్రారంభం

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 11 (విజయక్రాంతి): జనగణన 2027ను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా, డూప్లికేషన్ లేకుండా వాస్త వ గణాంకాలను సేకరించాలని ఆమె స్పష్టం చేశారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఛార్జ్ సెన్సస్ ఆఫీసర్లు, అదనపు ఛార్జ్ సెన్సస్ ఆఫీసర్లకు ఫేజ్-1 హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ పై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాణ్యమైన డేటాసేకరణే మన ప్రాధాన్యత కావాల ని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సెన్సస్, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో చేసే చిన్న పొరపాట్లు మొత్తం డేటాను ప్రభావితం చేస్తాయ ని, అందుకే అధికారులు టెక్నాలజీపై పట్టు సాధించి సిబ్బందికి మార్గదర్శనం చేయాలని సూచించారు.

ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీస ర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో జనగణన ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఎన్యుమరేషన్ బ్లాక్‌లో ఒక్క హౌస్ హోల్ కూడా మిస్ అవ్వకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ చంద్రకళ, వివిధ విభాగాల మాస్టర్ ట్రైనర్లు  సెన్సస్ అధికారులు పాల్గొన్నారు.