11 March, 2026 | 7:13 AM

ఆ పంటల కొనుగోలుకు కేంద్రం సానుకూల స్పందన

11-03-2026 01:11 AM

22న ఆయిల్‌ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం 

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి) : యాసంగి (రబీ) 2025 సీజన్‌లో తెలంగాణలో ఉత్పత్తి చేసిన వేరుశెనగ, పొద్దుతిరుగుడు, శెనగలు పంటలను కనీస మద్దతు ధర కింద కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ అనుమతి ఇవ్వా లని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఫోన్ లో మాట్లాడారు.

ఇప్పటికే పంటల కోతలు ఆరంభమైనందున పంటలను ప్రైస్ సపోర్ట్ స్కీమ్  కింద కొనుగోలు చేసేందుకు వెంటనే అవసరమైన అనుమతులు మంజూరు చేసి వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని విజ్ఞప్తి చేయగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించి, త్వరలోనే కొనుగోలుకు అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

ఆయా పంటల కొనుగోలుకు మార్క్ ఫెడ్ సిద్ధంగా ఉందని, శనగ పంటకోసం 45 కొనుగోలు కేంద్రాలు, పొద్దుతిరుగుడు పంటకోసం 20 కొనుగోలు కేంద్రాలు, మినుముల కోసం 10, వేరుశనగ పంట కోసం 5 కొనుగోలు కేంద్రాలను ఆరంభించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ నెల 22న సిద్దిపేట జిల్లాలోని నర్మెటలో ఆయిల్‌ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. వ్యవసాయం, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 20నుంచి 22 వరకు రైతు మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు.