‘ఓట్ల దొంగతనం’పై కేంద్రం కుట్ర
- బీజేపీది ‘బీహార్, బెంగాల్’ ఫార్ములా.. అప్రమత్తంగా ఉండాలి
- గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ బిఎల్‌ఓల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు
- పెద్దపల్లిలో బీఎల్‌ఏల శిక్షణ శిబిరంలో ఘాటు వ్యాఖ్యలు
పెద్దపల్లి,ఎన్టీపీసీ, జూన్ 14(విజయ క్రాంతి) కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను, రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకొని ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు తెరలేపిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఎన్టీపీసీలోని శ్రీమయి కన్వెన్షన్ హాల్లో టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన పెద్దపల్లి జిల్లా బూత్ స్థాయి ఏజెంట్ల అవగాహన, శిక్షణ శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ ఒక భూతం
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కేంద్రం తీసుకొచ్చిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ఒక పెద్ద భూతం అని, ఇది ముమ్మాటికీ దొంగదారి చర్యేనని విమర్శించారు. ‘కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో సుమారు 30 నుంచి 35 శాతం ఓట్లను ఫేక్ ఓట్లుగా చిత్రీకరించి తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. బీహార్, వెస్ట్ బెంగాల్లలో అమలు చేసిన ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలో ప్రయోగిస్తున్నారని, ఓటరు పేర్లు, వయస్సులో చిన్నపాటి తప్పులను సాకుగా చూపి ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని, దీనిని కాంగ్రెస్ సైనికులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ సీట్లను కూడా అక్రమ మార్గాల్లో దొంగిలిస్తున్నారని మండిపడ్డారు.
సింగరేణి అభివృద్ధి తర్వాతే ఎన్నికల ముచ్చట
సింగరేణి కార్మికుల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ అని, బీఆర్‌ఎస్ నాయకులు బొగ్గు గనుల చుట్టూ తిరుగుతూ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.
రాబో 10 ఏళ్లు కాంగ్రెస్ దే: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, రాబోయే పది ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ మ్యాపింగ్ ప్రక్రియపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు వచ్చే సమయానికి ఓటర్లు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. బిఆర్‌ఎస్ హయాంలో ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేశారని ఆయన ఆరోపించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి: ఎంపీ
ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని, సైనికుడిలా ప్రతి కార్యకర్త పని చేయాలని కోరారు. బీజేపీ అహంకారపూరిత కుట్రలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, ప్రభుత్వ సలహాదారు హర హర వేణుగోపాలరావు, ఎస్‌ఐఆర్ జిల్లా ఇంచార్జ్ సురేష్ షట్కార్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో బూత్ స్థాయి ఏజెంట్లు పాల్గొన్నారు. అంతకుముందు ఎస్‌ఐఆర్ శిక్షణపై నిపుణులు కార్యకర్తలకు అవగాహన కల్పించారు.






