10 August, 2026 | 10:00 PM

నా కుమార్తెకు న్యాయం చేయాలి

10-08-2026 09:13 PM

- తల్లి, పిల్లలను వేరు చేసేలా వ్యవహరించిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి

- ఏకపక్ష పంచాయతీలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలి

మణుగూరు టౌన్,(విజయక్రాంతి): తన కుమార్తెకు, ఇద్దరు మనవళ్లకు న్యాయం చేయాలని తలారి కవిత అధికారులను కోరారు. తల్లి, పిల్లలను వేరు చేసేలా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముత్యాలమ్మనగర్ సర్పంచ్‌పై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తలారి కవిత తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమార్తె హేమలతకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని, భర్త లేని పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న చిటికెన రామకృష్ణ మాయమాటలు చెప్పి ఆమెను తనవైపు ఆకర్షించేందుకు ప్రయత్నించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

జీవితాంతం పోషిస్తానని, పిల్లలను వదిలి వస్తే వివాహం చేసుకుంటానని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో హేమలతను మందలించడంతో పాటు, సంబంధిత వ్యక్తిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఇరువర్గాలు బయట మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుంటామని రామకృష్ణ కుటుంబ సభ్యులు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ముత్యాలమ్మనగర్ సర్పంచ్ జంపేశ్వరి ఇరువర్గాలను పిలిపించి పంచాయతీ ద్వారా సమస్యను పరిష్కరిస్తానని చెప్పినప్పటికీ, తమకు న్యాయం జరిగేలా కాకుండా పక్షపాతంగా వ్యవహరించారని హేమలత కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా హేమలత తన ఇద్దరు చిన్నపిల్లలను వదిలి వెళ్లేలా ప్రోత్సహించినట్లు వారు ఆరోపించారు.

తల్లి, పిల్లలను విడదీయడం సరికాదు

కుటుంబ సమస్యల పరిష్కారం పేరుతో నిర్వహించే పంచాయతీల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని తలారి కవిత అన్నారు. ముఖ్యంగా తల్లి, చిన్నపిల్లలను వేరు చేసేలా ఎవరైనా ఒత్తిడి చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆమె కోరారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

ఈ ఘటనపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి, కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధిగా వ్యవహరించే వ్యక్తి పంచాయతీలో పక్షపాతానికి పాల్పడినట్లు విచారణలో తేలితే, సంబంధిత పార్టీతో పాటు అధికార యంత్రాంగం కూడా తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కుటుంబ సమస్యలను పరిష్కరించే పేరుతో ఏకపక్ష పంచాయతీలు నిర్వహిస్తూ బాధితులకు మరింత అన్యాయం జరగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేశారు.