10 August, 2026 | 10:39 PM

భక్తిశ్రద్ధలతో కావడి పాదయాత్ర

10-08-2026 09:37 PM

- కందకుర్తి త్రివేణి సంగమం నుంచి ఏకచక్రేశ్వరాలయం వరకు

బోధన్,(విజయక్రాంతి): శివుడిపై ఉన్న అపారమైన భక్తి, విశ్వాసంతో బోధన్ పట్టణానికి చెందిన బాల్జీత్ సింగ్ వాల్మీకి పవిత్ర కావడి పాదయాత్ర చేపట్టారు. రేంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి, మంజీరా, హరిద్ర నదుల పవిత్ర త్రివేణి సంగమం నుంచి పవిత్ర జలాన్ని కావడిలో తీసుకుని బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వరాలయం వరకు పాదయాత్రగా చేరుకున్నారు. కావడిని భుజాన వేసుకుని శివనామస్మరణ చేస్తూ భక్తిశ్రద్ధలతో యాత్ర కొనసాగించారు.

ఎండ, అలసటను లెక్కచేయకుండా శివుడిపై ఉన్న విశ్వాసంతో ముందుకు సాగిన ఆయనను మార్గమధ్యంలో పలువురు భక్తులు అభినందించారు. యాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. కందకుర్తి త్రివేణి సంగమం నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఏకచక్రేశ్వరాలయానికి చేరుకున్న అనంతరం ముగిసింది. ఆలయానికి చేరుకున్న బాల్జీత్ సింగ్ వాల్మీకి కావడిలో తీసుకొచ్చిన పవిత్ర జలంతో ఏకచక్రేశ్వర స్వామివారికి అభిషేకం నిర్వహించారు.

కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి కలగాలని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కావడి యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. భక్తి, ఆధ్యాత్మికత, శివనామస్మరణతో సాగిన ఈ పాదయాత్ర స్థానికులను ఆకట్టుకుంది. త్రివేణి సంగమం నుంచి పవిత్ర జలాన్ని తీసుకుని పాదయాత్రగా ఆలయానికి చేరుకుని స్వామివారికి అభిషేకం చేయడంపై పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ యాత్ర భక్తి విశ్వాసానికి, ఆధ్యాత్మిక నిబద్ధతకు ప్రతీకగా నిలిచిందని వారు పేర్కొన్నారు.