3 April, 2026 | 4:26 AM

గ్రామాల అభివృద్ధికి కేంద్రం పెద్ద పీట

03-04-2026 01:59 AM

నిధులు విడుదల చేయడంతో.. హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2025- 26 సంవత్సరం మొదటి విడతలో భాగంగా తెలంగాణ గ్రామ పంచాయతీల కోసం తాజాగా రూ.619.85 కోట్లు విడుదల చేసిందని, ప్రధాని మోదీ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కు కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం సబ్కా సాథ్.. సబ్కా వికాస్’ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం విడుదల చేసిన రూ.619.85 కోట్ల నిధుల్లో రూ.371.91 కోట్లు టైడ్ గ్రాంట్’, రూ.247.94 కోట్లు అన్ టైడ్ గ్రాంట్’ అని పేర్కొన్నారు.  కేంద్రం విడుదల చేసిన నిధులకు సమానంగా మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు.

2015-- 16 నుంచి 2019-20 వరకు 14వ ఆర్థిక సంఘం కింద 5,060 కోట్లు విడుదల చేయగా, 2020- 21 నుంచి 2025- -26 వరకు 15వ ఆర్థిక సంఘం కింద కేటాయింపులు 80 శాతం పెరిగి 9,050 కోట్లకు చేరుకున్నాయన్నారు. దీంతో 14, 15వ ఆర్థిక సంఘాల కాలంలో కేంద్రం మొత్తం రూ.14,110 కోట్లు రాష్ట్రానికి కేటాయించిందని, వీటిలో 2026 జనవరికి ముందే రూ.11,111 కోట్లు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

2024-- 25కు సంబంధించి 2026 జనవరి నుంచి ఇప్పటివరకు రూ.1,032.42 కోట్లను విడుదల చేసినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. తాజాగా 2025-- 26కు సంబంధించి రూ.619.85 కోట్లను మొదటి విడత కింద విడుదల చేసినట్లు చెప్పారు. 16 ఆర్థిక సంఘం కింద 2026-- 27 నుంచి 2030- -31మధ్య కాలంలో తెలంగాణలోని గ్రామపంచాయతీలు రూ.9968 కోట్లను గ్రాంట్ రూపంలో కేంద్రం నుంచి పొందనున్నాయని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించని కారణంగా.. రెండేళ్లుగా పెండింగ్‌లో(2023-- 24, 2024- -25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన) నిధులను.. ఇటీవల గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగిన తర్వాత కేంద్రం విడుదల చేసిందని, తాజాగా 2025- -26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.