సంకేతాల్లో దాగిన చాణక్యవ్యూహం
పాలకుర్తి రామమూర్తి :
తూర్యధ్వజ పతాకాభిర్వ్యూహ
సంజ్ఞాః ప్రకల్పయేత్
స్థానే యానే ప్రహరణే
సైన్యానాం వినయే రతః!
(కౌటిలీయం -2-33)
సమర్థుడైన సేనాపతి వివిధ యుద్ధ విద్యల్లో, వ్యూహకల్పనల్లో నిష్ణాతు డై ఉండాలి. శత్రువులను జయించేందుకు అనుక్షణం సన్నద్ధుడై అప్రమత్తంగా ఉండా లి. శత్రురాజ్యాలపై దండెత్తేటప్పుడు సేనను అవసరమైనచోట నిలపడం, ముందుకుసాగడం, శత్రువులను ఆక్రమించడం లాంటి వి షయాల్లో సూక్ష్మంగా ఆలోచించి పటిష్టమైన వ్యూహాలు నిర్మించుకోవాలి.
తూర్యధ్వను లు చేయడం, ధ్వజసంకేతాలు, చిన్న పతాకాల వినియోగం వంటి అంశాలకు ముందు గానే నిర్దిష్ట సంకేతాలు, అర్థాలను నిర్ణయిం చి, వాటిని సైనికులకే తెలిసే రహస్య సంకేత వ్యవస్థగా రూపొందించి, వాటి వాడకంలో సైనికులకు శిక్షణనివ్వడంలో శ్రద్ధచూపాలి. దానితో శత్రువుకు తమ కదలికలు తెలియకుండా జాగ్రత్తపడవచ్చు.
అంతేకాక, ఎవరై నా గూఢచారులు తమ సైన్యంలో మమేకమైతే వారిని గుర్తించడం సులువవుతుంది. ఉన్నత సైన్యాధికారి తమ కింది అధికారుల తో నిరంతరం సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు విధానాలు, సంకేతాలను మారుస్తూ... సైన్యాన్ని అప్రమత్తంగా ఉంచా లి, అంటాడు ఆచార్య చాణక్య.
పై శ్లోకం ద్వారా చాణక్య ఉత్తమ నాయకత్వానికి అవసరమైన నాలుగు ముఖ్యమైన సూత్రాలు ప్రతిపాదించారు. అవి వ్యూహరచన, సమాచార నియంత్రణ, రహస్య సం కేత వ్యవస్థ, క్రమబద్ధమైన శిక్షణలు. ఈ ప్రతిపాదన నాటి యుద్ధరంగానికే పరిమితం కా దు. ఆధునిక కాలంలోనూ సైన్యం, పోలీసు, గూఢచారి వ్యవస్థలు, పెద్ద కార్పోరేట్ సంస్థ లు తమ అంతర్గత సమాచార వ్యవస్థలను రహస్య సాంకేతిక భాష, పాస్‌వర్డ్‌లు, సంకేతాలు లాంటి విధానాలతో నిర్వహించడం కనిపిస్తుంది.
దీన్ని చాణక్యుడు ప్రతిపాదించిన సమాచార భద్రతా సూత్రాలకు ఆధుని క రూపాలుగానూ, విస్తరణలుగానూ భావించవచ్చు. నిజానికి సైనిక భాష దౌత్యభాష కా దు. సైనిక భాషలో స్పష్టత, వేగం, గోప్యత అత్యంత ముఖ్యమైనవి. అత్యున్నతాధికారి తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాలు కిందిస్థా యి ఉద్యోగులకు స్పష్టంగా చేరాలి. అదీ శ త్రువుకు అర్థం కాకుండా ఉండాలి. కాలానుగుణంగా సంకేతాలను మారుస్తూ ఉండాలి. ఈ సంకేతాలపై సైనికులకు నిరంతర అవగాహన కల్పించాలి. వివిధ విభాగాల అధ్యక్షు లు, అధిపతులు, నిర్వహణాధికారుల మధ్య నిరంతర సమన్వయం ఉండాలి.
ఒక పెద్ద సైన్యం రాత్రివేళ అడవిలో ప్రయాణిస్తోందని అనుకుందాం. ఒక దగ్గర సైన్యం ఆగాలంటే ఒక ప్రత్యేక భేరీ ధ్వని వినిపించాలి. రెండు వరుస ధ్వనులు వినిపిస్తే ముందుకు కదలండి అనే సంకేతం.. ఒక నిర్ది ష్ట పతాకం ఒక వైపు తిరగమంటే, మరో ప తాకం శత్రువు కనిపించాడనే సంకేతాన్ని ఇ స్తుంది. ఈ ఉదాహరణ వివరణార్థం కల్పించినదే అయినా, ముందుగానే సంకేత వ్యవ స్థను నిర్దేశించి సైన్యానికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది.
కౌటిల్యుని అర్థశాస్త్రంలో చెప్పినట్లుగా రహస్య సంకేత వ్యవస్థను వివరంగా చెప్పకపోయినా, దానికి సమానమైన సైనిక క మ్యూనికేషన్ పద్ధతులు మహాభారత యు ద్ధంలో విస్తృతంగా కనిపిస్తాయి. కురుక్షేత్ర యుద్ధారంభంలో కృష్ణుడు, అర్జునుడు పాం చజన్య దేవదత్తాలను పూరించి శంఖధ్వను లు చేయడం సైనికుల్లో ఉత్సాహాన్ని నింప డానికే కాక యుద్ధ సంకేతాలుగాను, సైన్యానికి యుద్ధ ప్రారంభ సూచనలుగానూ పని చేసేవి.
అలాగే ధ్వజాల ద్వారా యోధులను గుర్తించడం జరిగేది. కపిధ్వజం అర్జునునిదిగాను, తాలధ్వజం భీష్మునిదిగానూ అలా ముఖ్యులైన యోధులకు ప్రత్యేక పతాకాల తో గుర్తింపు ఉండేది. యుద్ధభూమిలో దూ రం నుంచే సైనికులు తమ నాయకుడి స్థా నం తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడే వి. ఒక ధ్వజం పడిపోవడం అంటే ఆ నాయకుడు గాయపడినట్లు లేదా ఓడిపోయినట్లు సంకేతంగా భావించేవారు. అలాగే వ్యూహ ప్రతివ్యూహాల నిర్మాణాలు సైనికులకు ముం దస్తు సంకేతాలు, కాలానుగుణమైన ఆదేశాలు జారీచేయడం జరిగేది.
వాటి అమలు, క్రమశిక్షణలపై ఆధారపడి గెలుపోటములు నిర్ణయమయ్యేవి. అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించినప్పుడు, అతనికి సహా యంగా రావాల్సిన పాండవులను సైంధవుడు అడ్డుకుంటాడు. పద్మవ్యూహంలోకి శ త్రువు ప్రవేశించిన వెంటనే, బయటి వలయాలు క్రమబద్ధంగా మూసుకుపోతాయి. ఆ సమయంలో ప్రతి దళం తన స్థానాన్ని స రిగ్గా నిలుపుకోవడం, ఎప్పుడు ముందుకు క దలాలో, ఎప్పుడు దారిని మూయాలో తెలుసుకుని పనిచేస్తుంది.
దీనివల్ల వ్యూహక్రమా న్ని కాపాడటం, సైన్య కదలికలను నియంత్రించడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. ప ద్మవ్యూహం సాధారణ సైన్య నిర్మాణం కా దు. అది నిరంతరం కదులుతూ, లోపలికి వెళ్తున్న మార్గాలను మార్చుకుంటూ ఉండే యుద్ధవ్యూహం. అలాంటి వ్యూహంలో వేలాది మంది యోధులు ఒకే సమయంలో కదలాలంటే వారికి ముందుగానే నిర్ణయించిన సంకేతాలు, ఆదేశాలు, క్రమశిక్షణ తప్ప నిసరిగా ఉండాలి.
ద్రోణవధ సందర్భంలో ధర్మరాజు ‘అశ్వత్థామ హతః, కుంజరః’ అనడం ఆ కాలంలో సందర్భానుసారం సమాచారాన్ని వినియోగించిన విధానంగా చూడవచ్చు. ఇక్కడ యుద్ధ విజయంలో ఆయుధ శక్తికన్నా ప్రభావవంతమైన సమాచార వినియోగం, దాని ని అందించిన వ్యక్తి విశ్వసనీయత కీలక పాత్ర పోషించాయి. ఆధునిక సైనిక వ్యవస్థల్లోనూ నేడు రేడియో కోడ్‌లు, కాల్‌సైను లు, ఎన్‌క్రిప్టెడ్ సందేశాలు, మిత్ర-శత్రు గుర్తిం పు వ్యవస్థలను ఉపయోగిస్తున్న విధానం గమనించవచ్చు. దీన్ని ప్రాచీన కాలంలో ధ్వజాలు, తూర్యధ్వనుల ద్వారా నిర్వహించిన సంకేత వ్యవస్థలకు ఆధునిక రూపంగా భావించవచ్చు.
చాణక్యుని సూత్రం ప్రాముఖ్యతను వివరించే ఒక కథగా చెప్పుకొంటే.. ఒకప్పుడొక రాజ్యానికి సమర్థుడైన సేనాపతి ఉండేవాడు. అతడు తన సైనికులకు ఆయుధ విద్యలతో పాటు ప్రత్యేక సంకేత భాషలోనూ శిక్షణనిచ్చాడు. ఆ క్రమంలో పొరుగు రాజ్య గూఢ చారులు కొందరు సైనికుల వేషంలో తమ సైన్యంలో కలిసిపోయినట్లు అనుమానించిన సేనాపతి సంకేత భాషలో అవసరమైన మా ర్పులు చేశాడు.
ఈ మార్పును సైనికులందరికీ రహస్యంగా చేరవేశాడు. అయితే యుద్ధా భ్యాసం జరుగుతుండగా కొత్త సంకేతం వినిపించింది. నిజమైన సైనికులందరూ కొత్త ఆ దేశం ప్రకారం కదిలారు. కానీ, గూఢచారు లు మాత్రం పాత సంకేతాల ప్రకారమే స్పం దించడంతో మిగిలిన వారిలో భిన్నంగా కనిపించి, యుద్ధం చేయకుండానే పట్టుబడ్డారు.
చాణక్యుని సూచన యుద్ధరంగ వ్యూహాలకే పరిమితం కాదు. సమాచారాన్ని సరైన వ్యక్తికి, సరైన సమయంలో, సరైన విధంగా చేరవేయడం ఏ సంస్థ విజయానికైనా మూలమని తెలియజేస్తుంది. నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వ డం కాదు; వాటిని సమర్థంగా అమలు చేసే వ్యవస్థను నిర్మించడం. కేవలం ఆయుధాలే శత్రువును జయించలేవు, సరైన సమాచారాన్ని, సరైన వ్యక్తికి, సరైన సమయంలో చేర్చగలిగిన వివేకవంతమైన సమాచార వ్యవస్థ మాత్రమే విజయాన్ని ప్రసాదిస్తుంది.






