తృణమూల్ ముక్కలు!
పశ్చిమబంగాల్ రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మొన్నటివరకు ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడుల తో బంగాల్ అట్టుడకగా, నేడు ఏకంగా ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు రావడం సంచలనంగా మారింది. 58 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టిన టీఎంసీ బహిష్కృత నేత రితబ్రత ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఎన్నికవడం గమనార్హం. మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్నందున తమ వర్గాన్ని అసలైన టీఎంసీ శాసనసభా పక్షంగా గుర్తించాలని ఆయన కోరిన నేపథ్యంలో దేశంలో మరో ప్రాంతీయ పార్టీ చీలక ముంగిట నిలిచింది.
కాగా ఇటు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఓటమిపాలవడం, అటు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఇతరులను శాసనస భా పక్షనేతగా ఎన్నుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో శోభాందేబ్ ఛటోపాధ్యాయ్‌ను శాసనసభా పక్షనేతగా, ఫిర్హద్ హకీంను చీఫ్ విప్‌గా నియమించాలని కోరుతూ స్పీకర్‌కు అభిషేక్ బెనర్జీ లేఖ రాశారు. ఈ లేఖలో పలువురు ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలు రావడంతో టీఎంసీలో రాజుకున్న అసంతృప్తి బయటపడింది.
ఈ క్రమంలోనే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై రితబ్రతను టీఎంసీ బహిష్కరించగా, ఆయన ఏకంగా తృణమూల్ కాంగ్రెస్‌ను కుదిపేశారు. అయితే, ఒకవైపు తమ వర్గాన్ని అసలైన టీఎంసీగా గుర్తించాలని స్పీకర్‌ను కోరుతూనే, మరోవైపు తమ సలహాదారుగా మమతాబెనర్జీ ఉండాలనడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు గతంలో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలో చోటుచేసుకున్న చీలికలను గుర్తుచేస్తున్నాయి.
నాటి ఉదంతం చివరికి పార్టీ పేరు, ఎన్నికల గుర్తు, అసలైన పార్టీ ఎవరిదనే అంశాలపై న్యాయపోరాటాల వరకు వెళ్లిన విషయాన్ని మరువరాదు. ఇప్పుడు బంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందేమోననే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. బహిష్కృత నేతకు 58 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపడం సాధారణ విషయమేమీ కాకపోవడంతో, ఈ తిరుగుబాటు వెనుక ఎవరి ప్రోద్బలం ఉన్నదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. మొత్తంగా, టీఎంసీలో బయటపడిన ఈ అంతర్గత పోరు సాధారణ రాజకీయ భేదాభిప్రాయమా లేక బంగాల్‌లో పెద్ద రాజకీయ మార్పునకు నాంది పలికే పరిణామమా? అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. అయితే, ఇండీ కూటమిలో మమత కీలక నేత కావడంతో దీని ప్రభావం జాతీయ రాజకీయాలపైనా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.






