సీఎంకు స్పష్టమైన విజన్ అవసరం
అదనపు పనిగంటల వ్యాఖ్యలపై ఆగ్రహం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ‘గడియారాలు సమయాన్ని కొలుస్తాయి.. కానీ దూరదృష్టి ప్రభావాన్ని కొలుస్తుంది. నిజమైన నాయకత్వానికి అదనపు పని గంటలు కాదు.. పరిపాలనా విజ్ఞానం, స్పష్టమైన విజన్ అవసరం’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సీఎం రేవంత్‌రెడ్డికి హితవు పలికారు.
ముఖ్యమంత్రి ముందు సమయం లెక్కపెట్టడం కంటే పాలనా దూరదృష్టి నేర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు రోజుకు మరోగంట అదనంగా పనిచేయాలని సీఎం చేసిన వ్యాఖ్యలపై దాసోజు శ్రవన్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రాన్ని అవినీతి, అసమతుల్య ప్రాధాన్యతలు, అక్రమ కూల్చివేతలు, పోలీస్ రాజ్యం, భూస్వామ్య ధోరణులు, అపరిపక్వ పాలనలతో నష్టం చేకూరుస్తున్నారని ఆరోపించారు.
దీంతో మంత్రివర్గం, అధికార యంత్రాంగంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. తెలంగాణకు స్టాప్‌వాచ్ అవసరం లేదని, నిజాయితీతో కూడిన విజన్, స్పష్టమైన విధానాలు, సమర్థవంతమైన అమలు అవసరమన్నారు. రాష్ట్రంలో నిరంతర రెవెన్యూ లోటు, పెరుగుతున్న అప్పులపై ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఆత్మపరిశీలన చేశారా అని ప్రశ్నించారు. అలాగే ‘రైజింగ్ తెలంగాణ’ వంటి నినాదాలు మానేసి, ఇంకా మిగిలిన రెండేళ్లలో అయినా అవినీతి, అపరిపక్వ పాలనకు స్వస్తి చెప్పి పనితీరు మెరుగుపరచాలని సూచించారు.






