23 May, 2026 | 1:11 AM

‘బొద్దింకల’ విజృంభణ!

23-05-2026 12:00 AM

దేశ యువతలో గూడుకట్టుకుంటున్న ఆవేదన.. పొంగిపొర్లుతున్న ఆక్రోశం వ్యంగ్యంతో ఒక పార్టీగా ప్రస్తుతం వ్యవస్థల్ని ప్రశ్నిస్తే ఏమవుతుంది? అది సోషల్ మీడియాలో ఆన్‌లైన్‌లో పుట్టిన పార్టీ కాబట్టి చాలా తేలిగ్గా అణచివేతకు గురవుతుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై దేశంలోని యువత భగ్గుమంది. ‘నిరుద్యోగులు సోమరిపోతుల్లా, బొద్దింకల్లా తయారై జర్నలిస్టులు, న్యాయ వాదులు, సమాచార హక్కు కార్యకర్తల పేరుతో వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు’ అని సీజేఐ వారం క్రితం ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.

అయితే.. నిరుద్యోగులను తాను దునుమాడినట్టుగా మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆయన మరుసటిరోజు వివరణ ఇచ్చారు. అయితేనేం సీజేఐ వ్యాఖ్యలు కలకలం రేపాయి. మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దీప్కే ఈ వ్యాఖ్యలపై కకావికలమై ఆన్‌లైన్‌లో ఏకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) అంటూ వ్యంగ్య రాజకీయ ఉద్యమ వేదికను ఏర్పాటుచేశారు. ఐదు రోజుల్లో ఈ పార్టీ ప్రభంజనమైంది.

‘స్మార్ట్ ఫోన్లతో సహజీవనం సాగిస్తున్న నేటి యువత.. నిరుద్యోగం, భౌతికంగా సోమరిపోతులైనవారు, వ్యవస్థపై ఆగ్రహాన్ని అద్భుతంగా వ్యక్తీకరించడం వంటి లక్షణాలు వుంటే చాలు, వారు సీజేపీలో చేరవచ్చు’నని వ్యంగ్యంగా దీప్కే యువతను ఆహ్వానించారు. గతంలో ఆమ్‌ఆద్మీతో కలిసి నడిచిన దీప్కే ఇప్పుడు అమెరికాలోని బోస్టన్ వర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో చదువుకుంటున్నారు. ఐదు రోజుల్లోనే ఆ పార్టీకి ఆన్‌లైన్‌లో విశేష ఆదరణ లభించింది.

రాజకీయ పార్టీల ఆధిక్యాన్ని కాదని ఆన్‌లైన్‌లో ఈ వ్యంగ్య పార్టీ ఏకంగా 14.5 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. అంతే.. అధికార పీఠాలకు ఆగ్రహం వచ్చింది. ఐబీ కదిలింది. ‘బొద్దింకల’పై యుద్ధం ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా.. మరీ ముఖ్యంగా ఆసియాలో ‘జెన్‌జీ’ ప్రజాస్వామిక విప్లవాలు తెస్తున్న కాలమిది. అందరూ ఊహించినట్లుగానే ‘బొద్దింకల పార్టీ’ని ఆన్‌లైన్‌లో లేకుండా చిదిమేసే ప్రయత్నం చేశారు.

అయితే సోషల్ మీడియాలో ‘బొద్దింక’ రూపం మార్చుకొని ఫాలోవర్స్ ముందు నిలిచింది. యువత ఆగ్రహాన్ని, వేదనను ఒడిసిపట్టుకున్న ఈ ‘బొద్దింక పార్టీ’ వాస్తవంగా ఒక రాజకీయ శక్తిగా యువతకు ఆయుధమవుతుందా? వారి ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థలు ఉండేలా మార్పును తీసుకురానుందా? యువత ఆన్‌లైన్‌కే పరిమితమవుతుందా.. లేక ఒక శక్తిగా రాజకీయ యవనికపైకి వస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.