‘ప్రగతి’ రథసారథి వేదాచలం
ఆచార్య మసన చెన్నప్ప :
మనకు మేలు చేసినవారిని మనం ఎన్నటికీ మర్చిపోలేం. మర్చిపోకుండా ఉండటమే మనం మేలు చేసిన వారికిచ్చే కానుక! 1980లో ఎంఏలో సర్వప్రథముడిగా ఉత్తీర్ణుడైనందున నాకు గుర జాడ అప్పారావు స్వర్ణ పతకం లభించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దానికనుబంధ కళాశాలగా ఉన్న నిజాం కళాశాల ప్రాంగణంలో సాయంకాలం చదివి అవార్డు పొందినందుకు చాలా ఆనందం కలిగింది. అయితే అప్పటికి నేను సికింద్రాబాద్‌లోని ఇస్లామియా బాయ్స్ హైస్కూల్‌లో తెలుగు పండితునిగా పనిచేస్తున్నాను. అది నాకు పర్మినెంట్ ఉద్యోగమే.
ఎప్పుడైతే ఎంఏ పూర్తిచేశానో అప్పుడు సహజంగా లెక్చరర్‌ను కావాలన్న ఆశ నా లో పెల్లుబికింది. అదే సమయంలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున నెలకొన్న ప్రగతి మహా విద్యాలయం వారి జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్ ఉద్యోగం ఖాళీగా ఉన్నట్టు పత్రికా ప్రకటన వెలువడింది. ఆ ప్రకటనకు స్పందించిన నా క్లాస్‌మేట్స్, అంతకుముందు పీజీ చేసినవారు సుమారు 130 మంది వరకు ఒక్క ఆ లెక్చరర్ ఉద్యో గం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నేను కూడా దరఖాస్తు చేసుకున్నాను.
పీజీ డిగ్రీతోపాటు హైస్కూల్‌లో ఆరున్నర సంవత్సరాల బోధనానుభవం కలిగిన నేను జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి తగిన అర్హత సంపాదించిన వాడినయ్యాను. అంతకంటే ముఖ్యంగా స్వర్ణ పతకం నాకు తోడు గా ఉంది. అయినా ఉద్యోగం రావాలంటే అదృష్టం ఉండాలి. ఎవరినైనా పట్టుకోవాలి. అవసరమైతే లంచం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. కానీ, నేను ఒక నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించి చదువుతో పైకి వచ్చిన వాడినే గాని, ఇతర మార్గాలను అనుసరించి ఉద్యోగం సంపాదించేటంత శక్తి కలిగినవాడిని కాను.
మాకు తెలుగు శాఖాధ్యక్షులుగా ఉన్న ఆచార్య కే గోపాల కృష్ణారావుని కలిసి వారి ఆశీస్సులు కూడా పొందాను. ‘నా ఆశీస్సులు నీకు పూర్తిగా ఉన్నాయి’ అని భరోసా ఇచ్చారు వారు. ‘మీ గురువు వాచస్పతి గుండేరావు హర్కారే. వారి శిష్యుడవైన నీకు అన్ని విధాలుగా శుభం కలుగుతుంద’ని గోపాలకృష్ణారావు అభయమిచ్చారు.
ఒక్కగానొక్క లెక్చరర్ ఉద్యోగానికి మధ్యా హ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూలో నన్కొకరు అడిగిన ప్రశ్న ఇంకా జ్ఞాపకం ఉంది. ‘మీరు క్లాసులో ప్రవేశించగానే విద్యార్థులు అల్లరి చేస్తే, అప్పుడు మీరెలా ప్రవర్తి స్తారు’ అని. ‘రాగయుక్తంగా పద్యం చదివి అల్లరి జరగకుండా చూస్తాను’ అన్నా ను. ‘మరి వ్యాకరణం చెబుతున్నప్పుడు అల్లరి చేస్తే మీరు చేసేదేమిటి?’ అని తిరిగి ప్రశ్నించారు వారే. ‘వ్యాకరణాంశాన్ని కూడా ప ద్యం వినిపించి, దాని నుంచే గ్రహిస్తాను’ అని సమాధానమిచ్చాను. చాలా పొద్దుపోయింది కనుక ఇంకా కమిటీ వారు నన్నేమి అడిగారో, నేనేమి చెప్పానో నాకు జ్ఞాపకం లేదు.
ఇంటర్వ్యూ బాగా చేశాననే సంతృప్తితో నేను ఇంటికి వచ్చాను. ప్రగతి మహావిద్యాలయం అంటే ఆనాడు తెలంగాణలో ప్రసిద్ధి పొందిన విద్యాసంస్థ. జూనియర్, డిగ్రీ, పీజీ కోర్సులు గల సంస్థ అది. కామర్స్ కళాశాలగా దానికి మంచి పేరుంది.
అప్పటికి ఇంటర్వ్యూ జరిగి పది రోజులైంది. నాకు అంతకుముందే ఒక ఉద్యోగం ఉంది కనుక పెద్దగా ఆరాటపడలేదు. ఇట్లుండగా ఒక రోజు అకస్మాత్తుగా ఒక మిత్రుడు నా ఇంటికి వచ్చి ‘మీరు ప్రగతి కళాశాలలో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. ఇది జూనియర్ తెలుగు లెక్చరర్ ఉద్యోగమే. మీరు గోల్డ్ మెడలిస్టు కనుక మీకెప్పుడైనా డిగ్రీ కళాశాలలో లెక్చరర్ ఉద్యోగం రావచ్చు. కనుక మీరు ఈ ఉగ్యోగంలో చేరకపోతే మీ తర్వాత పేరుగల నేను ఉద్యోగంలో చేరుతాను. మీ మిత్రునికింత సహాయం చేయలేరా?’ అని తన మనసులోని మాట బయటపెట్టారు.
నా మిత్రుని మాటలు విన్న తర్వాత గాని నే ను సెలెక్ట్ అయిన విషయం నాకు తెలిసిరాలేదు. మనసులోని సంతోషాన్ని అణచుకుంటూ ‘మంచి విషయం చెప్పావు. ఈ విష యం చెప్పినందుకు మీకేమిచ్చినా తక్కువే కానీ, నేను సెలెక్ట్ అయిన ఉద్యోగం మాత్రం ఇవ్వను. ముందుముందు డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం వస్తుందని కలగన్నామా? ఇప్పటికి నేను హైస్కూల్ అధ్యాపకుడిని. నాకు పదోన్నతి లభించడం ఎందుకిష్టం ఉండదు?’ అని ఎదురు ప్రశ్న వేశాను.
నా మిత్రుడెమనుకున్నాడో కాని నా నుంచి సెలవు తీసు కొని వెళ్లిపోయాడు. ఆ మిత్రుడు తన అదృ ష్టం కొద్ది కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులయ్యారు. నేను సెలెక్ట్ అయిన సంగతి తెలియగానే నేరుగా ఓయూ తెలుగు శాఖాధ్యక్షులైన ఆచార్య గోపాలకృష్ణారావు దగ్గరికి వెళ్లి కలిశాను.
గురువుగారు నన్ను చూడగానే శుభా కాంక్షలు చెప్పి వెంటనే ప్రగతి మహా విద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్‌ను కలవమన్నారు. డాక్టర్ ఎన్‌టీ వేదాచలం గొప్ప పరిపాలనాదక్షుడు. ప్రగతి మహావిద్యాలయ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా రావడానికి ముందు వారు భద్రుకా కళాశాలలో పనిచేశారు. మూడు స్థాయులలో ఉన్న విద్యాసంస్థను సమర్థవంతంగా నడపడమంటే కత్తి మీద సాము చేయడం లాంటిదే.
ప్రగతి కళాశాలలో అంతకుముందు పనిచేస్తున్న మాడభూషి అనంతం నాకు మిత్రుడు. అతన్ని కళాశాలలో కలిసి ప్రిన్సిపాల్ దగ్గరకి వెళ్లాను. నమస్కరించి ‘మా తెలుగు శాఖాధ్యక్షులు పంపించారు’ అని చెప్పాను. నన్ను చైర్‌లో కూర్చొమ్మని చెప్పి ‘అంతమందిలో నీ ముఖం చూసినప్పుడు ఉద్యోగం నీకివ్వాలనిపించింది. కమిటీ యా వత్తు నా నిర్ణయాన్ని ఆమోదించారు’ అని చెబుతూనే, ‘ఒక మంచి రోజు వచ్చి చేరండి’ అన్నారు. వారి మాటలకు నా అంతరంగం ఆనందతరంగితం అయ్యింది.
డాక్టర్ వేదాచలం వద్ద సెలవు తీసుకొని నేరుగా నేను పనిచేస్తున్న ఇస్లామియా హైస్కూల్‌కు వెళ్లాను. ‘నాకు మూడు నెలలు సెలవివ్వండి’ అంటూ ఒక దరఖాస్తు పత్రం రాసి పాఠశాల హెడ్‌మాస్టర్‌కు ఇచ్చాను. ‘మీది పర్మినెంట్ ఉద్యోగం అంత తొందరగా విడిచి వెళ్లడానికి వీలులేదు. నేను సెల వు ఇవ్వను’ అని గట్టిగా చెప్పారు. నేను ఏదై తే అది అవుతుందని సెలవు చిట్టిని కార్యాలయంలో ఇచ్చి ఒక మంచి రోజున ప్రగతి కళాశాలలో చేరాను.
హైస్కూల్ హెడ్‌మాస్టర్ నన్ను రిజైన్ చేయవలసిందిగా లెటర్ పంపించారు. నాకు భయమేసి డాక్టర్ వేదాచలానికి విషయం చెప్పగా, ‘నీకేం భయం లేదు. ఇక్కడి ఉద్యోగం పర్మినెంట్. హైస్కూల్ ఉద్యోగానికి రాజీనామా చెయ్యి’ అని ధైర్యమిచ్చారు. వెంటనే హైస్కూల్ హెడ్ మాస్టర్‌కు రాజీనామా లేఖను పంపించాను. ప్రగతి మహా విద్యాలయంలో నేను ఎనిమిదిన్నరేళ్లు పనిచేశాను. వేదాచలం నా పరిశోధనలకు గొప్ప అవకాశం ఇచ్చారు. తత్ఫలితంగా ఎం.ఫిల్, పీహెచ్‌డీ సంపాదించాను. ఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రవేశించాను.
వ్యాసకర్త సెల్: 9885654385






