23 May, 2026 | 1:13 AM

కులగణన వ్యతిరేక పిటిషన్ల కొట్టివేత హర్షణీయం

23-05-2026 12:00 AM

దేశవ్యాప్తంగా కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ, బీసీల జనాభా లెక్కల సేకరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయం. సంక్షేమ పథకాల సమర్థ అమలుకు కులాల వారీ గణాంకాలు అవసరమని ధర్మాసనం స్పష్టం చేయడమంటే బీసీల హక్కుల కోసం సాగుతున్న ఉద్యమాలకు ఊతమివ్వడమే. ముఖ్యంగా బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణ య్యతోపాటు ఎంతోమంది నిరంతరం సాగించిన సామాజిక న్యాయ పోరాటానికి ఇదొక పెద్ద విజయంగా భావించాలి.

భారతదేశంలో బీసీలు జనాభా లో అత్యధిక శాతం ఉన్నప్పటికీ, వారి నిజమైన సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాలుగా కాలయాపన చేశాయి. 1931 తర్వాత పూర్తి స్థాయి కులగణన జరగకపోవడంతో బీసీల అసలు జనాభా, వారి వెనుకబాటుతనం, అభివద్ధి స్థాయిలపై స్పష్టత లేకుండా పోయింది. దీని కారణంగానే సంక్షేమ పథకాల అమలులో అసమానతలు చోటుచేసుకుని, జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం, అవకాశాలు బీసీలకు దక్కలేదు.

సుప్రీంకోర్టు తీర్పు ఈ చారిత్రాత్మక అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చే కీలక అడుగు. కులగణన ద్వారా ఏ వర్గం ఎంత వెనుకబడి ఉందో ప్రభుత్వాలకు స్పష్టమైన సమాచారం లభిస్తుంది. ఆ ఆధారంతో విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక సహాయం వంటి రంగాల్లో సముచిత అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, బీపీ మండల్ వంటి మహనీయులు ఆశించిన సామాజిక సమానత్వ సాధనకు కులగణన ఒక బలమైన ఆయుధం.

ఈ తీర్పు నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారదర్శకంగా కులగణన నిర్వహించి, బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాలు కల్పించాలి. అలాగే ఉద్యోగాల ఎంపికలో క్రీమిలేయర్ విధానాన్ని ఎత్తివేసి  బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన తరువాతే పార్లమెంట్ స్థానాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని బీసీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

 బూర్గుపల్లి కృష్ణ యాదవ్,

బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు