కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ మూర్ఖుల గుంపు
- 22ఏపై వినతిపత్రం అందజేత అడ్డగింత
- గంజాయి బ్యాచ్‌ను అడ్డుకోలేరు.. మమ్మల్ని అడ్డుకుంటారా?
- అడ్డుకున్న పోలీసులపై ఆగ్రహం
- భగ్గుమన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్
- గేట్‌కు వినతిపత్రం సమర్పణ
మంచిర్యాల, ఆగస్టు 22 (విజయక్రాంతి): మంచిర్యాల కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్‌ను మూర్ఖుల గుంపు, ‘ఎ బంచ్ ఆఫ్ ఇడియట్స్, జోకర్లు’ నడుపుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం 22ఏ నిషేధిత భూములపై బీజేపీ నాయకులు కలెక్టరేట్‌లో వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లగా ప్రధాన ద్వారం వద్ద వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో ఆగ్రహానికి గురైన రఘునాథ్ కలెక్టరేట్‌ను ‘మూర్ఖుల గుంపు’ నడిపిస్తోందని, కలెక్టర్‌కు కాంగ్రెస్ పార్టీ జీతం ఇస్తోందా? అని ప్రశ్నించారు. గంజాయి బ్యాచ్ రాజకీయం చేస్తుంటే అడ్డుకోలేని మీరు సామరస్యంగా వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుంటే అడ్డుకుంటారా? అని మండిపడ్డారు. వినతిపత్రం తీసుకోవడంపై పొంతలేని మాటలు మాట్లాడటాన్ని తప్పుబట్టారు. బీజేపీ నాయకులు సమస్యలతో వస్తే పరిష్కరించరని, ఎందుకని నిలదీశారు.
అనంతరం విలేఖరులతో మాట్లాడారు. 22 ఏ నిషేధిత భూముల జాబితాలోని అక్రమాలపై విచారణ జరిపించాలని, మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలన్నారు. ఈ విషయంపై కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించేందుకు వస్తే అడ్డుకున్నారని దీన్ని ఖండిస్తున్నామని అన్నారు. జీవోల పేరుతో పేదల భూములను లాక్కుంటున్నారని, అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం అధికారులు ఎవరూ వినతిపత్రం స్వీకరించకపోవడంతో కలెక్టరేట్ ద్వారానికే వినతిపత్రం సమర్పించి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణ మూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పట్టి వెంకట కృష్ణ, రమణరావు, కమలాకర్ రావు, ఆకుల అశోకవర్ధన్, ఆడే ప్రేమ్‌సింగ్, పచ్చ సప్నరాణి, బొడ్డు రఘునందన్, అమిరిశెట్టి రాజ్‌కుమార్, సత్రం రమేష్, కస్తూరి నాగరాజు, బోట్ల సత్యం, బింగి ప్రవీణ్, నల్ల రవి, మద్ది సుమన్, రాకేష్ రెన్వ, సల్ల సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.






