calender_icon.png 10 November, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్ ప్లాన్‌పై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్!

12-09-2024 02:27:24 AM

  1. వందశాతం నిధులను వినియోగించేలా ప్రణాళికలు 
  2. బీఆర్‌ఎస్ హయాంలో కేటాయింపులు, ఖర్చుల్లో భారీ వ్యత్యాసం 
  3. పదేళ్లలో నిర్వీర్యంగా ఎస్టీ, ఎస్సీ నిధులు 
  4. 2023 ఎస్సీలకు ఖర్చు చేసింది 10 శాతమే 
  5. ఎస్టీలకు కూడా అంతంత మాత్రమే 
  6. రేవంత్ ప్రభుత్వంపై దళిత, గిరిజనుల ఆశలు

హైదరాబాద్, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): గడిచిన పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్  సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది నుంచే సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేసే ఉద్ధేశంతో అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.

దళిత, గిరిజనుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. గణాంకాలు ఈ విషయాన్ని తేటాతెల్లం చేస్తున్నా యి. గత పదేళ్లలో కరోనా కాలంలో తప్పితే.. మిగతా ఏడేళ్లలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఎస్సీ నిధులను ఖర్చు పెట్టలేదు. కరోనా టైమ్‌లోనూ అత్తెసరు నిధులను కేటాయించి మమ అనిపించింది. ఎస్టీల నిధుల విషయంలోనూ ప్రభుత్వం కేటాయింపులతోనే సరిపె ట్టుకుంది. ఫలితంగా బీఆర్‌ఎస్ హయాంలో దళిత, గిరిజనుల సంక్షేమం అటకెక్కింది.

కేటాయింపులు ఖర్చుకు భారీ తేడా.. 

2022 బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీ డెవలప్‌మెంట్‌కు రూ.20,628 కోట్ల కేటాయించగా.. అందులో కేవలం 22 శాతం మాత్రమే ఖర్చు పెట్టింది. 2023 అయితే కేటాయింపుల్లో మరీ దారుణంగా 10 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేసింది. ఎస్టీల విషయానికొస్తే గతేడాది రూ.4,365 కోట్లు కేటాయించగా.. అందులో 54 శాతం నిధులను విడుదల చేసింది. 2022 ఆర్థిక సంవత్సరంలో కూడా కేవలం 61శాతం నిధులను మాత్రమే విడుదల చేసింది.  తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్సీ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన కేటాయింపులు.. ఖర్చుకు ఇంత భారీ మొత్తంలో తేడా ఉండటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

నిధులు నిర్వీర్యం..

సబ్ ప్లాన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్‌ను వారికే పూర్తిస్థాయిలో కేటాయించాలి. కానీ బీఆర్‌ఎస్ హయాంలో వంద శాతం నిధులను విడుదల చేయకపోవడంతో సంక్షేమం ఉత్తమాటగానే మిగిలింది. 2023 ఏడాది ఎస్సీ సంక్షేమ శాఖ మొత్తానికి ప్రభుత్వం రూ.36,750కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. కానీ కేవలం రూ.14,648 కోట్లే విడుదల చేసింది. అంటే.. కేటాయింపుల్లో కేవలం 23.4శాతం మాత్రమే గత సర్కారు విడుదల చేసింది.

అలాగే, 2018లో ఎస్టీ శాఖ మొత్తానికి రూ.9,693 కోట్లను ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది. కానీ విడుదల చేసింది కేవలం రూ.3,328 కోట్లు మాత్రమే. ఇది కేటాయింపుల్లో కేవలం 34 శాతం మాత్రమే. ఫలితంగా సగానికిపైగా కేటాయింపులు నిర్వీర్యమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి.

వారంలో డిప్యూటీ సీఎంకు నివేదిక

బీఆర్‌ఎస్ హయాంలో నిర్వీర్యమైన సబ్ ప్లాన్ చట్టాన్ని పునరుద్ధరించే విషయమై  డిప్యూటీ సీఎం భట్టి ఇటీవల రివ్యూ నిర్వహించారు. ఆయన ఆదేశాల మేరకు సబ్‌ప్లాన్‌ను తిరిగి అమలు చేయడంపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. సబ్ ప్లాన్ చట్టం అమలును మానిటరింగ్ చేసేందుకు ఆర్థిక శాఖ నుంచి ఒక అధికారిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తే ఎన్ని నిధులు కావాలి? లబ్ధిదారులు ఎంతమంది ఉంటారు? అనే విషయాలపై సమగ్ర నివేదిక రూపకల్పన తుదిదశకు చేరింది.