కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అనైతికం
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభమై న జర్నలిజం, జర్నలిస్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనైతికమని, ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండానే జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేసి అరెస్టు చేయడం అత్యంత దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విచారణ పూర్తయ్యాక తప్పొప్పులు పరిశీలించి చర్యలు తీసుకోవాలి కానీ, ఇలా ముందుగానే అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నామన్నారు.
ఓ న్యూస్ రిపోర్టర్ విషయంలో తలెత్తిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8 మంది సభ్యుల సిట్ ఇంకా విచారణ జరుపుతూనే ఉందని, ఇంతలోపే ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించ డాన్ని తప్పుబట్టారు. నిష్పక్షపాతంగా సిట్‌తో విచారణ జరిపించాలని, అక్రమంగా అరెస్టులు చేసిన జర్నలిస్టులను విడుదల చే యాలని, జర్నలిస్టులను భయపెట్టే చర్యలకు పాల్పడొద్దని ఆయన డిమాండ్ చేశారు.
అర్ధరాత్రి విమానాశ్రయంలో ఎన్టీవీ జర్నలిస్టు లను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచంద ర్ రావు తెలిపారు. కాంగ్రెస్‌పార్టీ ఎమర్జెన్సీ మనస్తత్వం ఇంకా మారలేదని, అధికారంలోకి వచ్చిన ప్రతిసారి భయభ్రాంతులకు గురిచేయడం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇది రాష్ర్టంలో పత్రికా స్వేచ్ఛపై, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన ప్రమాదకరమైన దాడిగా ఆయన అభివర్ణించారు.
ఎన్టీవీపై ద్వేషం: ఎన్వీ సుభాష్
సీఎం రేవంత్‌రెడ్డికి ఎన్టీవీ పట్ల ద్వేషభావం కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ ఆరోపించారు. ఒక ఛానల్ బీజేపీకి దగ్గరగా ఉందని, లేదా ప్రధాని మోదీకి అనుకూలంగా ఉందని భావించి టార్గెట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని బీజేపీ రాష్ట్ర ముఖ్యఅధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ విమర్శించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది కేవలం ఒక ఛానల్‌పై ప్రతీకారం కాదని, మిగతా జర్నలిస్టులందరికీ హెచ్చరికగా ఈ చర్యలున్నాయని బీజేపీ భావిస్తోందన్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తే ఇలాంటి గతి పడుతుందనే భయాన్ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకట్‌రెడ్డి, బీజేపీ నాయకులు కప్పర ప్రసాద్ పాల్గొన్నారు.




