3 August, 2026 | 2:35 AM

నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

03-08-2026 12:51 AM
  1. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
  2. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడికి పువ్వాడ పరామర్శ

ఖమ్మం, ఆగస్టు 2 (విజయక్రాంతి): అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి తదితర హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడి న యువకుడు వేణు ను ఆస్పత్రిలో పరామర్శించిన ఆయన, బాధితుడి ఆరోగ్య పరిస్థి తిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా యువకుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మాట్లాడుతూ, నిరుద్యోగుల ఆశలను వమ్ము చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, వారి న్యాయమైన హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమాయక యువకులు, నిరుద్యోగులతో ఆడలాడుకుంటుందన్నారు. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని, క్యాలెండర్ ఇయర్ ప్రకటిస్తామని కళ్లబొళ్ళు మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వందల్లో ఉద్యోగాలు భర్తీ చేసి చేతులు దులుకుందన్నారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, నిర్యోదుగుల ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు, ఆర్జేసీ కృష్ణ, లింగాళ కమళరాజు , పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్ పాల్గొన్నారు.