20-01-2026 12:00:00 AM
ప్రజలు ఆసహ్యించుకునేలా భాష ఉండొద్దు
బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): జాతీయ పార్టీ హోదా కోల్పోయి మనుగడ సాగిస్తున్న సీపీఐకు వచ్చిన పరిస్థితే త్వరలోనే కాంగ్రెస్‌కు కూడా రానున్న దని బీజేపీ ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీపీఐ జాతీయ మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్ ఖండించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ సైతం మనుగడ సాగించడానికి ప్రయత్నించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉంటూ మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ చులకన అవుతున్నారన్నారు.
తప్పుడు మాటలతో, కుట్రలు, కుతంత్రాలతో రేవంత్ రెడ్డి పాలిస్తున్నారన్నారు. తులసివనంలో గంజాయి అనే పదం కాంగ్రెస్ పార్టీకి అక్షరాల వర్తిస్తుందన్నారు. మోడీపై వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, ప్రజలు అసహ్యించుకునేలా భాష ఉండొద్దన్నారు. మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే భారత్ అగ్రదేశంగా రూపొందుతుందని భారతీయులం దరూ విశ్వసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.