7 March, 2026 | 6:06 AM

17 ఏళ్ల నత్తనడక

07-03-2026 12:00 AM

ఇంకెన్నాళ్లీ నిరీక్షణ?

మరో మూడు నెలల గడువు

ఈసారైనా పూర్తయ్యేనా?

ఘట్ కేసర్, మార్చి 6 (విజయక్రాంతి): ఒకటి కాదు, రెండు కాదు అక్షరాలా 17 ఏళ్లు. ఒక తరం మారిపోయింది, పసిపిల్లలు ప్రయోజకులయ్యారు కానీ ఘట్ కేసర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం మాత్రం ఇంకా నిర్మాణదశ లోనే ఉంది. నత్తనడకను తలపిస్తున్న ఈపనుల తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దశాబ్దాల కల దారిచూపని వంతెన

2009 ప్రాంతంలో మొదలైన ఈ ప్రాజెక్టు, అనేక అడ్డంకులు, నిధుల లేమి, సమన్వయ లోపం వల్ల ఏళ్ల తరబడి మూలన పడింది. నాడు రైల్వే గేటు పడితే చాలు, ఘట్ కేసర్ ప్రజలు, వాహనదారు కష్టాలు వర్ణనాతీతం. అత్యవసర వైద్య సేవలు అందక, ఆఫీసులకు, పాఠశాలలకు వెళ్లేవారు సమయానికి చేరుకోలేక నరకయాతన అనుభవించారు. బ్రిడ్జి నిర్మాణం పనులతో రైల్వే గేటు మూసివేయడం, పనుల జాప్యంతో నేడు అదే పరిస్థితి అనుభవిస్తున్నారు. 

స్థానిక నాయకులు అసమర్థత

స్థానిక రాజకీయ నాయకుల అసమర్థతతోనే రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేకపోయిoదని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈప్రాంతo అభివృద్ధికి కృషి చేయాల్సిన నాయకులు మూర్ఖపు రాజకీయాలకు పాల్పడుతున్నారని పలువురు విద్యావంతులు విమర్శిస్తున్నారు.  సమస్యల పరిష్కారానికి ఒక నాయకుడు అధికారులకు, పరిపాలనలో ఉన్న ముఖ్య నేతలకు ఫిర్యాదులు, వినతులు అందజేస్తే అదే సమస్యతో మరో నాయకుడు వినతులు అందజేయడం ఏమిటని  ప్రశ్నిస్తున్నారు.

ఇదంతా పేరు కోసం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ  రాజకీయాలు చేస్తున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. నాయకులకు రాజకీయాలు ఎన్నికల సమయం వరకే ఉండాలి కానీ ఇలా ఎప్పుడు చండాలపు ఆలోచనలతో ఉండటం మంచిది కాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక వంతెనలు పూర్తి అవుతున్నాయి కానీ ఘట్ కేసర్ వంతెన ఎందుకు పూర్తి కావడం లేదని స్థానిక నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలని విద్యావంతులు సూచించారు.

గత్యంతరం లేక రైలు పట్టాలు దాటుతూ ప్రాణాలు పోతున్నాయన్న విషయాన్ని గుర్తించి నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోకుండా రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇటీవల స్థానిక నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్రిడ్జి నిర్మాణ పనుల జాప్యంపై జేఏసీ నాయకులు, మహిళలు, యువకులు రోడ్లపైకి చేరి ఉద్యమ బాట పట్టారు. ర్యాలీలు, ధర్నాలు చేశారు.

గతంలో బ్రిడ్జి నిర్మాణ జాప్యంపై మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ నిరాహార దీక్ష చేపట్టగా అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బ్రిడ్జి పనులు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చి దీక్ష విరమింపజేసిన ఫలితం లేకపోయింది. ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి చివరి దశకు చేరుకున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వంతో నిధులు విడుదల చేయించి పూర్తి చేయిస్తానని మరోసారి హామీ ఇచ్చారు.

3 నెలల గడువు

స్థానిక ప్రజలు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో, అధికారులు, కాంట్రాక్టర్ స్పందించారు. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయని చెబుతూ, మరో 3 నెలల గడువు కోరారు. అంటే, మే 31, 2026 నాటికి ఈ బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

17 ఏళ్లుగా సాగుతున్న ఈ జాప్యానికి బాధ్యులెవరని, ఇప్పుడు ఇచ్చిన 3 నెలల గడువు నిజంగా తుది గడువు అవుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిసారీ గడువు పెంచడమే తప్ప, పని పూర్తి చేయడం లేదని, ఈ మూడు నెలల్లో పనులు పూర్తి కాకపోతే మళ్లీ ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈసారి ఎమ్మెల్యే మల్లారెడ్డి, అధికారులు, కాంట్రాక్టర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఈ 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఇకనైనా తెరపడి మే నెలాఖరు కల్లా బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు ప్రారంభం కావాలని ఘట్ కేసర్ ప్రజలు కోరుకుంటున్నారు.

చాలా ఇబ్బందులు పడుతున్నారు

నత్తనడకన సాగుతున్న బ్రిడ్జి నిర్మాణంతో విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో 17 ఏళ్ల నుంచి పబ్బంకడుపుతున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని వారి సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. బ్రిడ్జి నిర్మాణం సమస్యలో నాయకులు రాజకీయాలను పక్కన పెట్టాలి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి వంతెన పనులు త్వరలో పూర్తి చేయాలి.

- విద్యార్థి నాయకుడు అంకం శ్యామ్ కిరణ్

నాలుగు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. 

బ్రిడ్జి నిర్మాణం జాప్యంతో నాలుగు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణించలేనివి. రైలు పట్టాలు దాటుతూ, అనారోగ్యంతో ప్రయాణిస్తూ అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్రభుత్వ యంత్రాంగానికి చలనం లేదు. ప్రజల ఆగ్రహానికి గురికాకముందే బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి. అందుకోసం రాజకీయ నాయకులు ఐక్యత ప్రదర్శించాలి.

- హేమలత స్థానికురాలు