calender_icon.png 13 February, 2026 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లెక్కింపు పారదర్శకంగా నిర్వహించాలి

13-02-2026 12:18:01 AM

కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : నేడు జరగనున్న పురపాలక సంస్థల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన  ఓట్లు లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్ వైజర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓట్లు లెక్కింపు కేంద్రంలో అనుసరించాల్సిన నియమావళి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, టేబుల్వైజ్ కౌంటింగ్ విధానం, బ్యాలెట్ పేపర్లు వేరు చేయుట, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి ఫలితాలను సమగ్రంగా నమోదు చేసి, సంబంధిత అభ్యర్థుల ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని, తదుపరి పరిశీలకుల అనుమతితో విజేతలను  ప్రకటించాలని అధికారులకు సూచించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు తెలిపారు.

గుర్తింపు కార్డు కలిగిన వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. సిబ్బంది ఉదయం 7 గంటల వరకు లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.  సీసీ కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, అనుమతి పొందిన వ్యక్తులకే ప్రవేశం కల్పించబడుతుందని స్పష్టం చేశారు.  లెక్కింపు సిబ్బంది సమయానికి కేంద్రాలకు హాజరై తమ విధులను బాధ్యతా యుతంగా నిర్వర్తించాలని ఎలాంటి పొరపాట్లకు  తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

జనరల్ అబ్జర్వర్ పాండా దాస్ మాట్లాడుతూ కౌంటింగ్ ను చాలా పకడ్బందీగా  నిర్వహించాలని, వ్యాలిడిటీ, ఇన్ వ్యాలిడిటీ ఓట్ల గురించి ఆర్వోలకు  పూర్తి అవగాహన కలిగి ఉండాలని,  ఒకసారి ఒక ఓటును రైట్, రాంగ్ గా నిర్ధారించిన తర్వాత  ఎట్టి పరిస్థితుల్లోనూ  అట్టి నిర్ణయాన్ని మార్చుకోకూ డదని, కౌంటింగ్ సిబ్బంది అందరూ సకాలంలో హాజరుకావాలని అన్నారు. ఈ శిక్షణ సమావేశంలో  అదనపు కలెక్టర్ సీతారామారావు, సూర్యాపేట,కోదాడ, హుజూర్నగర్  ఆర్డీవోలు వేణు మాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్లు, తాసిల్దారులు, రిటర్నింగ్ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.