27 April, 2026 | 3:16 AM

ఒక అధికారి జీవితం వెనుక సృజనాత్మక ప్రపంచం

27-04-2026 01:28 AM

ఆయన ప్రభుత్వ సేవలో 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఐఏఎస్ అధికారి. అదే సమయంలో నాలుగు దశా బ్దాలుగా కార్టూన్ల ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన కళాకారుడు. ఈ అరుదైన కార్టూనిస్టే బీపీ ఆచార్య. ఒక ఉన్నతాధికారి చేతిలో కలం ఉంటే ఎలా ఉంటుంది? ఆ కలం ఫైళ్ల మీద సంతకాలు మాత్రమే కాకుండా, కార్టూన్ రేఖల్లో సమాజాన్ని చూసే చూపుగా మారితే? అదే ఈ పుస్తకానికి ప్రాణం. ఆయనకు 11 ఏళ్ల వయసులోనే కార్టూన్లపై ఆసక్తి మొదలైంది.

1971 బంగ్లాదేశ్ యుద్ధ కాలంలో పత్రికల్లో వచ్చిన కార్టూన్లను కాపీ చేస్తూ సాధన చేశారు. నాటి ప్రముఖ కార్టూ నిస్టులు శంకరన్ కుట్టి, ఆర్‌కే లక్ష్మణ్ కార్టూన్ల ప్రభావం ఆయ న కార్టూన్లలో రేఖామాత్రంగా కనిపిస్తుంది. ఎంతో సాధన చేసి తన స్వంత శైలిని సాధించారు. తనదైన ఆలోచనలతో కార్టూన్లు గీయడం ప్రారంభించారు. కార్టూన్ ఆయనకు కేవ లం అలవాటు కాదు. తనదైన వ్యక్తీకరణకు సాధనం. 1983 లో ఆయన ఐఏఎస్ కొలువుసాధించారు.

ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఆయన కార్టూన్ కళను వదలలేదు. లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పొందుతున్న  సమయంలో వాల్ జర్నల్‌లో కార్టూన్లు ప్రదర్శించారు. అకాడమీ డ్రెస్ కోడ్‌పై వ్యంగ్యంగా గీసిన కార్టూన్ అప్పట్లో ఆదరణ పొందింది. ఐఏఎస్ ఆఫీసర్ల బులెటిన్‌లో ‘అబ్‌ట్యూస్ యాంగిల్’ శీర్షికతో బ్యూరోక్రటిక్ జీవితంపై వ్యంగ్య చిత్రాలు వేశారు. ప్రభుత్వ సేవకుడిగా ఉన్న కారణంగా రాజకీయ విమర్శల కంటే స్వీయ విమర్శాత్మక హాస్యాన్ని ఎంచుకున్నారు.

2020లో పదవీ విరమణ తర్వాత, ఆయనకు మళ్లీ కార్టూన్లు గీసే సమయం దొరికింది. ఇప్పుడు కొంత స్వేచ్ఛ పెరిగినప్పటికీ, ఆలోచనల్లో సమభావాలను పాటిస్తుంటారు. ప్రస్తుత సామాజిక-, రాజకీయ పరిస్థితులపై కొన్ని ఆంగ్ల పత్రికల్లో నిత్యం కార్టూన్లు వేస్తున్నారు. ‘నేటి పరిస్థితుల్లో కార్టూనిస్టులకు వాతావరణం కఠినంగా మారింది. విమర్శను హాస్యంగా స్వీకరించే సహనం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెహ్రూ కాలంలో ఉన్న హాస్య సంస్కృతి తిరిగి రావాలి’ అంటారు.

అనుభవాలే కార్టూన్ బుక్‌గా

బీపీ ఆచార్య ఐఏఎస్ అధికారిగా పనిచేసిన అనుభవాలను కార్టూన్ల రూపంలో ఈ పుస్తకంలో ఆవిష్కరించారు. సాధారణంగా అధికారుల జీవితాలు గంభీరంగా, కఠినంగా కనిపిస్తాయి. కానీ, ఆచార్య గారు తన అనుభవాలను హాస్యంతో, వ్యంగ్యంతో, సున్నితమైన విమర్శతో చిత్రించారు. అధికార వ్యవస్థలోని లోపాలు, అధికారుల మధ్య జరిగే సంఘటనలు, ప్రజలతో సంబంధాలు.. ఇవి అన్నీ ఆయన కార్టూన్లలో చమత్కారంగా వ్యక్తమవుతాయి.

చిన్ననాటి నుంచే ఆయనకు కార్టూన్ల పై ఆసక్తి. పత్రికల్లో కార్టూన్లు ప్రచురితమయ్యాయి. ఉద్యోగ జీవితంలోనూ ఆ అభిరుచిని కొనసాగించారు. ముస్సూరీ ట్రైనింగ్ సమయంలో గీసిన కార్టూన్లు సహచరులకు ఎంతో నచ్చాయి. తర్వాత వివిధ సందర్భాల్లో గీసిన కార్టూన్లను ఈ పుస్తకంగా సమగ్రంగా తీసుకువచ్చారు. ఈ పుస్తకం కేవలం హాస్య రసభరితమైన కార్టూన్ల  సమాహారం మాత్రమే కాదు. ఇది ఒక అధికారి ఆత్మకథలా కూడా ఉంటుంది.

అధికార వ్యవస్థలోని ఒత్తిళ్లు, రాజకీయ ప్రభావాలు, ప్రజా సమస్యలు ఇవన్నీ సున్నితంగా పాఠకులను కదిలిస్తాయి. ఆయన గీతల్లో విమర్శ ఉన్నా కాఠిన్యత లేదు, వ్యంగ్యం ఉన్నా దూషణ లేదు. ఇలా సమతూకం పాటించడం కార్టూనిస్టులకు కష్టమే కానీ ఆయన సాధించారు. సరళమైన భాష, స్పష్టమైన భావప్రకటన, చమత్కార భరితమైన చిత్రాలు ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.

ప్రభుత్వ వ్యవస్థను లోపల నుంచి చూడాలనుకునే వారికి, కార్టూన్లను ఇష్టపడే వారికి, సృజనాత్మకతను ప్రేమించే వారికి ఈ పుస్తకం నవ్వుల విందు. మొత్తానికి, ఒక అధికారిక జీవితం వెనుక ఉన్న సృజనాత్మక ప్రపంచాన్ని పరిచయం చేసే వినూత్న పుస్తకం. నవ్విస్తూ ఆలోచింపజేసే పుస్తకమిది.

 శ్యాంమోహన్, వ్యాసకర్త సెల్: 9440595858 

‘అబ్‌ట్యూస్ యాంగిల్’ పుస్తకం 

‘అమెజాన్’లో లభ్యం 

పేజీలు: 288, వెల: ౩౯౯