27 April, 2026 | 3:39 AM

తెలంగాణ అస్తిత్వ ఆర్తి ‘పేగు తెగిన పాట’

27-04-2026 01:25 AM

అలాజ్‌పూర్ కిషన్ కవి :

మంజీర రచయితల సంఘం ప్రచురించిన ‘పేగు తెగిన పాట’ కవితల సంకలనంలో దశాబ్దాల తెలంగాణ అస్తిత్వ పోరాటాలు, ఉద్యమాలు కళ్లముందు నిలుస్తాయి. కవి అలాజ్‌పూర్ కిషన్ తాను స్వ యంగా చూసినవి, విన్నవి, తెలుసుకున్నవి.. ఇలా తనను కదిలించిన సామాజిక ఘట్టాలన్నింటినీ అక్షరీకరించారు. తన కవిత్వంలో దక్కన్ పీఠభూమి గొప్పతనం, శ్రమజీవులకు వెట్టి నుంచి విముక్తి, ప్రపంచీకరణ ప్రభావాలు, ఆదివాసీల అగచాట్లు, అస్తిత్వ ఉద్యమాలు, తెలంగాణ సాంస్కృతిక వారసత్వం.. ఇలా ఎన్నో అంశాలపై కవిత్వం రాశారు.

ఈ సంకలనంలో ‘జ్ఞానం’ అనే కవిత కిషన్ తాత్విక చింతనకు అద్దం పడుతుంది. మట్టి నుంచి పుట్టిన మనిషి వేదనను, ఆ వేదన నుంచి పుట్టే కవిత్వాన్ని ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు కవి. ‘నన్ను నేను ఖండించుకుంటే / మట్టి నుంచి కవితా పుష్ప మై విచ్చుకున్నాను / నా గుండెలో ప్రేమ పావురాలు ఎగురవేస్తే / సింహం జూలు విదిల్చి నాతో కరచాలనం చేసి కవాతు లో కదిలి వస్తున్నది’ అంటూ తనను తాను ఆవిష్కరించుకున్నారు.

దోసిళ్లలో కన్నీళ్లు పట్టుకుని నదిలో కలిపితే, ఆ నది సముద్రానికి వీడ్కోలు చెప్పి పొలాలన్నింటినీ తడిపి ప్రపంచానికి అన్నం పెట్టిందని కవి చెప్పడం ఆయనలోని మాన వతావాదాన్ని చాటుతున్నది. ‘కల్లోలం’ కవితలో దేశ సరిహద్దుల నుంచి గల్లీల వరకు నెలకొన్న అశాంతిని కవి ప్రశ్నిం చారు. గాంధీని చంపిన తుపాకీ గుండు మొదలుకుని, ఏఆర్ రెహమాన్ సంగీతం వరకు భూత, భవిష్యత్, వర్తమానాలను పరికించారు. సామాజిక సంక్షోభాలను ఎండగట్టారు.

‘నేనిప్పుడు కల్లోల దేహాన్ని / ఢిల్లీ పార్లమెంటులో స్వేచ్ఛా రెక్కల్ని / తెగ్గోయబడ్డ పావురాన్ని / సైన్యం కవాతులో కరువైన నీడలో / దగ్ధమౌతున్న కాలాన్ని’ అంటూ స్వేచ్ఛా కాముకతను వ్యక్తీకరించారు. సమాజంలోని కృత్రిమత్వాన్ని ‘కృత్రిమ భూమి’ కవితలో నిలదీశారు. అపార్ట్‌మెంట్ సంస్కృతిలో మనిషికి మట్టికి మధ్య పెరుగుతున్న దూరాన్ని విశ్లేషించారు.

‘అపార్ట్‌మెంటు ఇల్లు ఆత్మగల ఇల్లు కాదు / పడుకుంటే భూమికి ఆకాశానికి మధ్య / ఊగుతున్నట్టుంటది / అరవై అంతస్తులు డ్బ్బు అంతస్థుల / పై నుంచి కింది చూస్తే క ళ్లు గిర్రున తిరిగి చక్కరొస్తది వణుకొస్తది’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. తన పాదాలు భూమి మీద ఉండాలని, మనిషి భూమి మీద లేనట్టుగా పాతాళంలోకి పారిపోతున్నట్లుగా ఉం దని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలోని దోపిడీని, పాలకుల తీరును ‘ముగింపు వాక్యం’ కవితలో తీక్షణంగా విమర్శించారు.

మాయల మరాఠీ ప్రాణం చిలుకలో ఉ న్నట్లుగా, నేటి నాయకుల ప్రాణం ఓట్లలో ఉందని ఎద్దే వా చేశారు. ‘నిఘంటువు లేని గణితశాస్త్రానివి/ ప్ర శ్నించే గళాలకు స్వేచ్ఛా కలాలకు/ సంకెళ్లు వేసిన జాదూ వి/ అంబేద్కర్ జపం చేస్తూ రా జ్యాంగాన్ని కత్తిరిస్తూ/ కంటికి కనబడని కుట్రవి’ అంటూ రాజకీయాల్లోకి కు ళ్లును ఎండగట్టారు. తాను దేశభక్త సైనికుడిని అంటూ కవిత్వం ద్వారా గర్వంగా ప్రకటించుకున్నారు. మనుషుల మధ్య పెరుగుతున్న అంతరాలను ‘అద్వైతం’ కవితలో వ్యంగ్యంగా చిత్రించారు.

సముద్రం భూమిని, సూర్యుడు చంద్రుణ్ణి మింగినట్టుగానే, నేటి సామాజిక వ్యవస్థలో బలవంతులు బలహీనుల కడుపు కొడుతున్న తీరును ఆయన తప్పుబట్టారు. ‘మనిషి డాలర్‌ని మింగాడు/ నాయకుడు ఓట్లని మింగాడు/ రాజు రాజ్యాన్ని మింగాడు/ అయినా దేవుడు మాట్లాడడు/ దేవుని ఆత్మను ఎవరు మింగుతారు!’. దేవుడు నిశ్శబ్దంగా ఉండటాన్ని ప్రశ్నిస్తూనే, మరణం లేని ఆత్మ కోసం కవి అన్వేషించారు. ‘దండోరా’ కవితలో ఆర్టీసీ కార్మికుల గోసను, సమ్మె హక్కును బలంగా సమర్థించారు.

హక్కుల కోసం పోరాడే వారిని పాలకులు అణచివేస్తున్న తీరును ఖండించారు. ‘సమ్మె చట్ట వ్యతిరేకం కాదు చట్టబద్ధం/ సమ్మె హక్కు కదా సమ్మె రాజ్యాంగ బద్ధం కదా/ హక్కులడిగితే వారికి నిద్ర పట్టదు/ మనిషంటే వాడికి బానిస/ ప్రశ్నిస్తే భరించడు’ అంటూ నిష్కర్షగా చెబుతారు. కష్టపడే వారికి పైసలు ఇవ్వని దొరలు, అసెంబ్లీలో లక్షలు లక్షలు తీసుకుంటున్నారంటూ ప్రశ్నిస్తారు. పేదరికాన్ని, అమాయకత్వాన్ని ‘గోసోలె బాపు’ కవితలో మనసుకు హత్తుకునేలా వివరించారు.

తెల్లని బట్టల వెనుక ఉన్న తెల్లని హదయం గురించి చెబుతూ బాపు బతుకు చిత్రాన్ని గీశారు. ‘సుమతి శతకం, వేమన శతకం వల్లె వేసేది/ నీతి పద్యాల సారం ఇప్పి చెప్పేది/ దూలాల మీద పద్యాలు రాసిండు/ పైస పైస కూడబెట్టి ఇల్లు కొన్నడు/ నూలిచ్చి చీరెలు నేపించి అమ్మేది’ అంటూ సూటిగా చెబుతారు. ముత్యాల్లాంటి గొలుసు కట్టు రాత రాసిన బాపు, తన తలరాతను తాను రాసు కోలేకపోయారని చెప్పడం పాఠకులను కంటతడి పెట్టిస్తుంది.

చివరగా ‘గోగుపూల పాట’లో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను కవి మరోసారి గుర్తు చేశా రు. పాట గొంతు వగబోయిన వేళ, తెలంగాణ నినాదాల పాటలతో గాలి హోరెత్తిందని గుర్తుచేశారు. ‘వాడు భూమిని గాలినీ ఆక్రమిస్తున్నాడు/ మనిషినీ మనసునూ ఆక్రమిస్తున్నాడు/ ఆక్రమణకు లొంగనిది పాట ఒక్కటే/ ఆమె గొంతు నెవరాపగలరు?”.

అడవి గాలిని, గోగుపూల చెట్ల మీద పరవశాలను అడుగుతూ తెలంగాణ అస్తిత్వాన్ని ఎలుగెత్తిచెప్పారు. మొత్తం మీద అలాజ్‌పూర్ కిషన్ ‘పేగు తెగిన పాట’ కవిత్వం తెలంగాణ మట్టి వాసనను, మనిషి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తోంది. ఆస్తిత్వ ఉద్యమాలు, సాంస్కృతిక వారసత్వాలను ఇష్టపడే ప్రతిఒక్కరినీ ఈ సంకలనం మెప్పిస్తుంది.

 గీత