ఖమ్మం జిల్లా అభివృద్ధే లక్ష్యO
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం,కామేపల్లి, జులై 19(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అడవి మద్దులపల్లి గ్రామంలో రూ.2.85 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ ఉపకేంద్రం ద్వారా ప్రాంత ప్రజలకు మరింత నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందే అవకాశం కలగనుంది. అనంతరం రూ.3.95 కోట్ల వ్యయంతో తాళ్లగూడెం నుంచి నర్సయ్యకుంట వరకు (యం.పి.పి.యస్. పాఠశాల మీదుగా) చేపట్టనున్న బీటీ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.5 కోట్ల అంచనా వ్యయంతో ఇల్లందు ఆర్&బీ రోడ్డు నుంచి కామేపల్లి స్మశాన వాటిక వరకు కామేపల్లి పెద్ద చెరువు మీదుగా నిర్మించనున్న బీటీ రహదారి పనులను ప్రారంభించారు.
ఈ అభివృద్ధి పనుల ద్వారా విద్యుత్, రహదారి మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా, సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






