26 June, 2026 | 1:47 AM

నియోజకవర్గ అభివృద్ధే నా సంకల్పం

26-06-2026 12:00 AM

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ, జూన్ 25 (విజయక్రాంతి): రఘునాథపల్లి మండలం గబ్బేట గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, సిసి రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లను గ్రామస్తులు, లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న ఆరోగ్య ఉప కేంద్రం పూర్తి చేయడానికి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తానని నెల రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక సర్పంచ్ ను ఆదేశించారు.

అలాగే కోమటిగూడెం రోడ్డును త్వరలోనే మంజూరు చేస్తానని, ముదిరాజ్ కమ్యూనిటీ హల్ పూర్తి చేయడానికి మరో 5లక్షలు వెంటనే మంజూరు చేస్తానని, మహిళా సమాఖ్య భవనం కూడా త్వరలోనే మంజూరు చేస్తానని తెలిపారు. నెల రోజులలోపు మరో 25లక్షల సిసి రోడ్లు మంజూరు చేస్తానని అన్నారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండున్నర ఏళ్లలో గబ్బేట గ్రామంలో కోటి 50లక్షలతో పలు అభివృద్ధి పనులు చేసుకున్నామని వెల్లడించారు. కడియం శ్రీహరి ఏనాడూ అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు.

పని చేయని వారిని,  పని చేసే వారిని ఒకే రకంగా చూడవద్దని ప్రజలను కోరారు. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఏకైక సంకల్పంతో పని చేస్తున్నాన్ని పేర్కొన్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కూటికంటి ఉపేంద్ర అనిల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.