16 May, 2026 | 4:46 PM

త్రికాల.. ఓ ఫిక్షనల్ హీరో

16-02-2025 12:00 AM

రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీసాయిదీప్ చాట్లా, వెంకట్ రమేశ్ దాడి సహ నిర్మాతలుగా త్రికాల సినిమాను మణి తెల్లగూటి తెరకెక్కిస్తున్నారు. శ్రద్ధాదాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి ముఖ్య పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నటుడు అజయ్ మాట్లాడుతూ.. ‘మణి, శ్రీనివాస్ ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటారు. మణి నాకు రెండు, మూడేళ్ల క్రితం ఈ కథ చెప్పారు. అద్భుతంగా తీశారు’ అన్నారు. మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. ‘ఈ మూవీ కోసం చాలా రీ షూట్ జరిగింది. కానీ ఎప్పుడూ కూడా నిర్మాతలు ప్రశ్నించలేదు’ అని చెప్పారు.

రవి వర్మ మాట్లాడుతూ.. “త్రికాల’లో చిన్న పాత్రగా మొదలైనా, సినిమా అంతా నన్ను వాడేశారు’ అన్నారు. దర్శకుడు మణి మాట్లాడుతూ.. ‘ఈ మూవీ కోసం చాలా వదులుకున్నాం. సపోర్ట్ చేయండి’ అన్నారు. నిర్మాత రాధిక మాట్లాడుతూ.. “సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మన సూపర్ హీరోల్ని అందరికీ చూపించాలని త్రికాల సినిమాను తీశాం.

టైమ్‌తో సంబంధం లేకుండా కాపాడేవాడే ‘త్రికాల’ అని చెప్పారు. మరో నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘మన పురాణాల్లోనే హనుమాన్, భీమ వంటి సూపర్ హీరోలున్నారు. అలా ఓ ఫిక్షనల్ హీరోను సృష్టించాలనుకున్నాం. అలా పుట్టిందే ఈ త్రికాల’ అని తెలిపారు.