జిల్లాను విద్యారంగంలో అగ్రభాగాన నిలపాలి
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, జూలై 29 (విజయక్రాంతి) :సూర్యాపేట జిల్లాను విద్యా రంగంలో మరింత అగ్రపథాన నిలిపేందుకు ఉపాధ్యాయులు నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లకు నిర్వహిస్తున్న మూడు రోజుల సమగ్ర వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు, బాధ్యతలపై దిశా నిర్దేశం చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో సూర్యాపేట జిల్లా ప్రచేష్టలో మొదటి స్థానాన్ని సాధించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేస్తూ విద్యాశాఖ బృందాన్ని అభినందించారు. ప్రపంచీకరణ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో విద్యార్థుల భవిష్యత్తు అవసరాలను గుర్తించి తరగతి గది బోధన సాగాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా కృత్యాధార బోధన, ప్రయోగాలు, ప్రాజెక్టులు, గ్రూప్ డిస్కషన్స్ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ను ఉపాధ్యాయులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆదేశించారు. చదువుతో పాటు విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధించేలా పర్యవేక్షించడానికి ప్రధానోపాధ్యాయులు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
అలాగే తోటలో అన్ని పూలూ వికసిస్తేనే అందంగా ఉంటుందని అలాగే క్లాస్ రూమ్లో కేవలం కొందరు విద్యార్థులు మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరూ రాణించి ఉత్తమ ఫలితాలు సాధించినప్పుడే లక్ష్యం నెరవేరినట్లు అన్నారు.ఈ కార్యక్రమంలో డీఈవో కే. అశోక్, సెక్టోరియల్ అధికారులు హరికృష్ణ, రేణుక, సెంటర్ ఇంచార్జ్ నాగరాణి, జిల్లా రిసోర్స్ పర్సన్లు శ్రీహరి శ్రవణ్, సత్యనారాయణ రెడ్డి, యోగానంద్ తదితరులు పాల్గొన్నారు.






