చెట్టును నాటిన వాళ్ల కల
వాళ్లప్పుడో ఒక చెట్టును నాటి దాని ఫలాలను
తమ ప్రజలంతా అనుభవించాలని కలలు గన్నారు
వటుడింతై అన్నట్టు చెట్టు పెరిగి పెద్దదై
ఆకాశాన్ని భూమినీ ఆక్రమించింది దిక్కులేని
పక్షులన్నింటికీ చెట్టు ఆశ్రయమిచ్చి ఆదుకుంది
ఆకలిగొన్నవారికి ఫలాలను నీడ
కోల్పోయినవారికి నీడను గూడులేని వారికి గూడును
ఓడిపోయినవారికి ఓదార్పును అందిస్తూ
చెట్టు పెద్దదిక్కయింది.. చెట్టునిండా చూపుడువేళ్లు
జెండాలై రెపరెపలాడాయి
చెట్టునిండా అణగారిన వర్గాల అస్తిత్వాలు
హరిత పత్రాలై విచ్చుకున్నాయి
పీడితుల ఆత్మగౌరవాలు పూల పరిమళాలై గుబాళించాయి
తూర్పున ఉదయించే సూర్యుడు
ఆ చెట్టుకొమ్మల్లోంచే ఉదయించటం మొదలైంది
అణగారిన బతుకుల్లోని చీకట్లను తరుముతూ
వేల కిరణాల కొమ్మల చేతులు చాచింది చెట్టు
శాఖోపశాఖలుగా విస్తరించిన చెట్టును చూసి
కాలానికి కన్ను కుట్టింది
చెట్టుకెవవో లేనిపోని చీడపీడల్ని ఆపాదించి
తమ దారికడ్డమని కొంతమంది
చెట్టును కొట్టేయాలని చూస్తున్నారు
తమ త్యాగాలను ఎరువుగా వేసి తమ చెమట చుక్కల్ని నీళ్లుగా పోసి తమ జాతికి నీడనివ్వటం కోసం
చెట్టును నాటినవాళ్ళ స్ఫూర్తి
ఊరకే పోతుందా? చెట్టు ఆశ్రయం పొందిన పిట్టలన్నీ
రెక్కలు విదిలిస్తున్నాయి
తమ పదునైన వాడి ముక్కుల్ని కత్తుల్లా ఝుళిపిస్తున్నాయి
ఎరుపెక్కిన పిట్టపాటలతో
చెట్టంతా మారుమోగుతోంది.. చెట్టును ముట్టుకున్న
వాళ్లను చెట్టుకిందే పాతిపెట్టే
కొత్త యుద్ధమొకటి మొదలైంది.. ఈ చెట్టు పచ్చగా
వుంటేనే దేశమంతా పచ్చగా వుంటుందని
చెట్టు నూరిపోసిన పాఠం పిట్టలకు బాగానే తెలుసు
చెట్టును నాటినవాళ్ల కలను అవి తప్పక కొనసాగిస్తాయి.
చిత్తలూరి






