27 April, 2026 | 3:35 AM

అంతరాళంలో వైశాఖం

27-04-2026 01:20 AM

వడివడిగా విరుచుకుపడిన 

వైశాఖపు వడగాడ్పులు,

కొలిమిలో కాగిన ఇనుప 

తీగలై దేహాన్ని చుట్టేస్తూ

కనిపించని ఉక్కపోతతో 

అడుగులను చెఱబట్టి

అరికాలి మంటల్నీ అంతరంగానికి 

అంటిస్తున్నై!


అస్తిత్వ లోతులను దహిస్తున్న 

ఉక్కిరి బిక్కిరిలో

ఎండవేడిని తాళలేక మోడువారిన 

తరువులు

అహరహం అలముకునే 

అహాన్ని అణచి వేయమని

శిథిల జ్ఞాపకాల్ని రాల్చేయమని చెప్తున్నట్టే ఉన్నై!


తొలిచినుకు స్పర్శకై తపించే 

పుడమిలా హృదయం,

ఆత్మీయత కరువై ఎండి, 

పగుళ్ల నెగళ్లుగా మారి

తనలోని రిక్తతలో తానే రూపు 

కోల్పోయినట్టుగా

స్వచ్ఛమైన పలకరింపునకై 

ఎదురుచూస్తోంది.

ముగింపులేని విషాదంలా 

విస్తరించిన వైశాఖపు ఉదయాలు

నీడను మింగేసిన మిట్ట 

మధ్యాహ్నాలుగా మారి

సుప్తచేతనలో సంచితమైన 

ఏకాంతాన్ని చూసి

గ్రీష్మం పకపకా నవ్వుతున్నది.

దప్పికతో ఎండమావిని వెంటాడినట్టే

దరికిరాని ఆశలవెంట పరిగెత్తిన ప్రాణాన్ని

తీక్షణమైన ఉష్ణంతో చర్మానికి 

నిలువునా పులిమి

ఆ సెగను రాత్రి గోడలకు అంటిస్తూ

తాపం, గాలినిసైతం 

గొంతు నులుముతున్నది

కంఠాన్ని బిగించి.. దుఃఖాన్ని దిగమింగి

మంటల గాయాలతో 

మాధుర్యాన్ని అద్దుకుని

వేసవిని ఆవురావురని 

పీల్చిన మామిడిపండులా

కాలిన స్వప్నాల బూడిదలోంచి 

అమృతాన్ని పిండుకుంటూ

స్వయానా ఏదో నిశ్శబ్ద పక్వం 

కుదురుకుంటున్నది

ఎక్కడో..

దూరం నుంచి వినిపించే

ఏకాకి కోయిల గానం

ఇంకా మిగిలే ఉన్న శ్వాసల్ని కదిలిస్తూ

నిక్షిప్త తడిని లేలేమ్మనీ తట్టి లేపుతున్నది.

బహుశా.. వైశాఖం.. రాలిన రాగాల 

మరణశాసనం కాదు

తొలకరిని గర్భంలో దాచుకుని రగిలే

ప్రకృతి ప్రసవ వేదన జ్వలంత జీవోద్భవం!

 శ్రీను పైండ్ల