విద్యుత్తేజం చెరబండరాజు కవిత్వం
2న చెరబండరాజు వర్ధంతి :
‘పుడమితల్లి చల్లని గుండెను
పాయలు పాయలుగా
చీల్చుకొని
కాల్వలై ఎవరిదో
ఏతరం కన్నీరో
గలగలా సుళ్లు తిరిగి
మెల్లమెల్లగా పారుతూంది
దూరంగా ఊరి
చివరి మైదానం
శిరసెత్తిన సరస్సై
నింగివైపూ పొంగుతూంది..’
*****************************
కాంతిపాదాలతో
కదంతొక్కుతూ
నడుస్తున్న వాణ్ణి
మీ కళ్లలో పెరిగిన
చీకటి అరణ్యాల్ని
తగలబెట్టేవాణ్ణి
మీ గుండెల్లో చోటుచేసుకున్న
శూన్యపు ఆకాశాల్ని వెలిగించే వాణ్ణి
పాలిపోయిన నరనరాన్ని పితికి
జీవనదికి ఊటలు సృష్టించేవాణ్ణి
మీ అస్తిత్వాన్ని ఆశయాల్ని
కాలదన్ని మీ కలల్ని పావులుగా
చదరంగం ఆడేవాళ్ల
ఆటకట్టించేవాణ్ణి
*******************************
‘వడ్డీలా పెరుగుతున్న ఆకలి
ఆకాశం విస్తట్లో అన్నపుముద్ద
ఆనవాలు పట్టరాని అందుబాటులో లేని
సానుభూతి కరువైన
సంతకాలు సాక్ష్యాలు స్నేహాలు
రోగగ్రస్తమైన దేశంలో
రుణాల పేరిట వ్రణాలు
*********************************
చేతులు దాచుకుంటున్న దాతలు
రోడ్డుపక్క రేగుతున్న దుమ్ములో
మూగజీవాల మూల్గులు
కిరణం దూసుకురాని చెరసాలలో
వాయిదాలు పెడుతున్న మరణం’.. అంటూ పీడితులు, తాడితులు, నిరుపేదల కడగండ్లను తన రచనల ద్వారా ఎలుగెత్తి చెప్పిన కవి చెరబండరాజు. తన ఆలోచన, అక్షరం, ఆచరణ.. మూడు వేర్వురు కాదు ఒక్కటేనని చూపించిన అరుదైన కవి ఆయన. దిగంబర కవుల్లో ఈయన ఒకడు. తెలుగు సాహిత్య రం గంలో మూస పద్ధతులను బద్దలు కొడుతూ 1960ల ప్రాంతంలో దిగంబర కవిత్వం పెల్లుబికింది.
ఆ దిగంబర కవులే నగ్నముని, నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి, భైరవయ్య, మహాస్వప్న. సమాజంలోని కుళ్లును, అవినీతిని బట్టబయలు చేస్తామనే స్ఫూర్తితో ఈ ఆరుగురు కవులు కంకణం కట్టుకున్నారు. మిగిలిన కవుల కంటే చెరబండరాజు శైలి విభిన్నంగా ఉండేది. శ్రమజీవికి కుడి ఎడమల నిలబడిన కవిగా ఆయనకు పేరుండేది. చెరబండరాజు 1944లో ఘటకేసర్ మండ లంలోని అంకుషాపూర్ గ్రామంలో జన్మించాడు.
ఆయన అసలు పేరు బద్దం భాస్కర్‌రెడ్డి. వారికి నిరపేద రైతు కుటుంబం. ప్రసవవేదన భరించలేక తల్లి చనిపోతూ ఆయనకు జన్మనిచ్చింది. తల్లిలేని బాధ ఆయన్ను చివరి వరకు వెంటాడింది. పసితనంలో తండ్రి ఆ బిడ్డకు భాక్కారెడ్డి అని పేరు పెట్టాడు. పాఠశాలలో చేరాక ఒక ఉపాధ్యాయుడు బతుకులు బక్కవైనంత మాత్రాన పేర్లు బక్కగుండాలా అనే ఉద్దేశంతో బక్కారెడ్డి పేరును భాస్కరరెడ్డిగా పేరు మార్చాడు.
ఆ ఉపాధ్యాయుడే ఆయనకు శరత్ చంద్ర నవలలను పరిచయం భాస్కర్‌రెడ్డికి చేశాడు. తెలంగాణ ప్రాంతంలోని శ్రమజీవన సౌందర్యం చెరబండరా జుకు కవిత్వాన్ని పరిచయం చేసింది. వ్యవసాయ కుటుంబం కావడంతో పొలంలో కూలీలు, రైతులు పాడుతున్న పాటల ప్రభావంతో ఆయన కవిత్వం రాయడం ప్రారం భించాడు. నవ యౌవన ప్రాయంలోనే తన పేరు పక్కన కులం ఉండకూడదని ఆయన తన పేరును ‘చెరబండరాజు’గా మార్చుకున్నాడు.
16 ఏళ్ల వయస్సులోనే ఆయనకు వివాహం జరిగింది. భార్య శ్యామలతో కలిసి పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆమె నుదుటిపై చెమటతో అంటుకున్న కురులపైనా ఆయన పద్యాలు రాశాడు. 1965 - 68 మధ్య కాలం లో కమ్యూనిస్టు పార్టీలో చీలికలు రావడం, అమెరికాలో బీట్ జనరేషన్ తిరుగుబాటు, ఇంగ్లాండు, పశ్చిమ బంగాల్‌లో సాహిత్య ధోరణులు తలెత్తాయి. ఈ ధోరణుల ప్రభావంతో సమాజంలోని అన్యాయాలను చూసి చెరబండరాజు కవిత్వం రాశాడు.
1970లో ఆయన విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడినప్పుడు అందులో చేరారు. 1971-- ౭2లోవ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడిగా, కార్యదర్శిగా పనిచేశాడు. దిగంబరకవి నుంచి విప్లవకవిగా మారాక విప్లవ సాహిత్యానికి పాట అవసరాన్ని గుర్తించి విరివిగా పాటలు రాశాడు. ‘వందేమాతరం‘ గేయం ప్రశంసలు పొందింది.
శ్రీశ్రీపైనా ప్రభావం
అప్పటిదాకా సంస్కృత పదాలతో కవిత్వం రాసిన మహాకవి శ్రీశ్రీ కూడా చెరబండరాజు రచనలతో ప్రభావితమయ్యాడంటే ఆ రోజుల్లో చెరబండరాజు రచనలకు ఉన్న పదును ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో గద్దర్ కూడా ఆయన నుంచి ప్రేరణ పొందాడు. దాని పర్యావసానంగానే గద్దర్ ప్రజావాగ్గేయకారుడిగా రూపాంతరం చెందాడు. వృత్తిరీత్యా చెరబండరాజు ఉపాధ్యాయుడు. ఎమర్జెన్సీ సమయంలో టీచర్ ఉద్యోగం పోయినప్పుడు బతుకుదెరువు కోసం ఆటో నడిపి కుటుంబాన్ని పోషించుకున్నాడు.
తద్వారా కార్మిక దృక్పథాన్ని తన ఆచరణలో చూపించాడు. 1975 ఏప్రిల్‌లో ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించిన సందర్భంలో మహాకవి శ్రీశ్రీతో పాటు ఆయన అరెస్టయ్యాడు. 1971- 77 మధ్యకాలంలో మూడేళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. ఈ క్రమంలో చెరబండరాజు ఆరోగ్యం క్షీణించింది. జైలులో మొదలైన తీవ్ర తలనొప్పి బ్రెయిన్ క్యాన్సర్‌గా పరిణమించింది. 1977 నుంచి 1981 మధ్యలో ఈయనకు మూడుసార్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.
అనారోగ్యంతో ఉండగానే ఆయన ప్రభుత్వం ఉద్యోగం పోయింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, పేదరికం కుంగదీసినా, అనారోగ్యం నిలువునా దహిస్తున్నా చెరబండరాజు రచనా వ్యాసాంగాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. పోలీస్ కేసులు, కోర్టు వాయిదాలతో చివరి రోజులు గడిచాయి.
అనేక అటుపోట్లను అనుభవించి, చివరకు 1982 జూలై 2న ఆయన కన్నుమూశాడు. చెరబండరాజు చనిపోయే నాటికి ఆయనకు ౩౮ ఏళ్లునా నిండలేదు. భౌతికంగా ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ, పేదల పక్షాన ఆయన నిలిచిన తీరు, వారి కష్టాలకు కలం ద్వారా చిందించిన కన్నీరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయనడం సందేహం లేదు.
సజీవ చిత్రణతో రచనలు
1960 నాటి దేశ కాలమాన పరిస్థితులపై ఇతర దిగంబర కవుల్లానే చెరబండరాజు కూడా రాజీలేని కవిత్వం రాశారు. చెరబండరాజు కవితల సంకలనాల్లో ‘దిక్చూచి’, ‘ముట్టడి’, ‘గమ్యం’, ‘కాంతి యుద్ధం’, ‘గౌరమ్మ కలలు’, ‘జన్మహక్కు’, ‘పల్లవి’, ‘కత్తి పాట’ బహుళ ప్రాచుర్యం పొందాయి. ‘కొండలు పగలేసినం, బండలనే పిండినం’, ‘ఏ కులమబ్బీ మాదేమతబ్బీ’ వంటి పాటలు జనాదరణ సాధించాయి. ‘మా పల్లె’, ‘ప్రస్థానం’, ‘నిప్పుల రాళ్లు’, ‘గంజినీళ్లు ’అనే నవలలు సైతం చెరబండరాజు రాశాడు.
60వ దశాబ్దంలో వస్తున్న కథలకు భిన్నంగా ఆయన తన కథలు రాశాడు. ఆర్థిక ఇబ్బందులతో వేసారిపోయిన చిరుద్యోగుల జీవన పోరాటాన్ని, దొరల పాలనలో నలిగిపోతున్న గ్రామీణ ప్రజల వ్యథాభరిత జీవితాలను అనేక పాత్రలతో సజీవంగా చిత్రించారు. ఇక ఆ రోజుల్లో ‘చిరంజీవి’ కథ అయితే.. పెద్ద సంచలనం. ఒక బాలుడి ఎన్‌కౌంటర్ య థార్థ ఈ కథ నేపథ్యం సాగుతుంది. అప్పట్లో ఆ కథ ప్రభుత్వ నిషేధానికి గురైంది.
‘ఒంటిమీది గుడ్డలతో జెండాలు కుట్టించి వివస్త్రవై ఊరేగుతున్న దైన్యం నీది..అప్పు తెచ్చి లేపిన మిద్దెల్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది’ అంటూ రాసిన కవిత అనేక విమర్శలకు తావిచ్చింది. దేశమాతను కవి అవమానపరిచాడని విమర్శకులు తమ విమర్శలతో చీల్చిచెండాడారు. అయినప్పటికీ, చెరబండరాజు వెరవలేదు. తన కవిత్వం సమాజంలోని అసమానతలను, సంపన్నుల చేతుల్లో నలిగిపోతున్న వ్యవస్థను ఎండగడుతుందని తెగేసిచెప్పాడు.
చైతన్య






