8 April, 2026 | 9:00 AM

ఈఎన్సీ జనరల్ బాధ్యతలు రమేశ్‌బాబుకే

07-02-2026 12:51 AM

విజయక్రాంతి కథనానికి స్పందించిన ప్రభుత్వం

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): నీటిపారుదల శాఖలో కీలకమైన ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్) పోస్టు వారం రోజులుగా ఖాళీగా ఉండటం, కనీసం ఇన్‌చార్జి నియామకం కూడా జరగకపోవడంపై పెరిగిన విమర్శలకు ప్రభుత్వం స్పందించింది.

‘విజయక్రాంతి’లో కథనం వెలువడిన రోజే చర్యలు తీసుకుంటూ, ప్రస్తుతం ఈఎన్సీ అడ్మిన్‌గా ఉన్న ఓవీ రమేశ్‌బాబుకు ఈఎన్సీ జనరల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈఎన్సీ (జనరల్)గా పనిచేసిన అంజాద్ హుస్సేన్ గత నెల 31న ఉద్యోగ విరమణ చేయడంతో ఆ కీలక పోస్టు ఖాళీగా ఉన్నది. అయితే వారం రోజులు గడిచినా భర్తీ జరగకపోవడం, ఇన్‌చార్జి బాధ్యతలు కూడా అప్పగించకపోవడం శాఖలో పరిపాలనా గందరగోళానికి దారితీసింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం ‘విజయక్రాంతి’ దినపత్రికలో ‘ఈఎన్సీ.. నియామకం ఎప్పుడు?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి వెంటనే స్పందించిన ప్రభుత్వం రమేశ్‌బాబుకు ఈఎన్సీ (జనరల్)గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

నారాయణపేటలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కే బ్రహ్మానంద్‌ను కొడంగల్ (ఐసీ-3, మక్తల్) పరిధిలోని ఐడీ-9 విభాగానికి ఎఫ్‌ఏసీపై నియమించారు. ఇక కరీంనగర్‌లో ఓ/ఓ ఈఎన్సీ కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న కే రాధాకృష్ణకు ఐసీ-2, కరీంనగర్ పరిధిలో డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ తాజా నియామకాలతో నీటిపారుదల శాఖలో కొనసాగుతున్న పరిపాలనా అనిశ్చితికి తాత్కాలికంగా తెరపడినట్టు అధికారవర్గాలు భావిస్తున్నాయి.