మావోయిస్టుల అంతం అసాధ్యం
సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
ముకరంపుర, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): దేశంలో మావోయిస్టుల ఏరివేత అసాధ్యమని, అసమానతలు, ఆకలి కేకలు ఉన్నన్ని రోజులు ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయని, మావోయిస్టులను అంతం చేయడం సాధ్యమని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో పరిపాలన కొనసాగిస్తుందని సిపిఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.
బుధవారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టుల ఏరివేత పై డెడ్ లైన్ పెట్టి, పోలీసులను ఉసిగొల్పటం అప్రజాస్వామికమని అన్నారు. రాజ్యాంగబద్ధ పాలన వీడి, నియంతృత్వ పాలనతో దేశంలో అలజడి రేపెందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వేలాది మంది పోలీసుల బూట్ల చప్పుళ్ళతో, తుపాకీ తూటాలతో సామాన్య అమాయకులు సమిదలవుతున్న నేపథ్యంలో మావోయిస్టులు తీసుకుంటున్న నిర్ణయం తాత్కాలిక విరామమే కానీ, ఉద్యమం అంతం కాదని తేల్చి చెప్పారు.
కరీంనగర్ పార్లమెంటు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మావోయిస్టుల పట్ల చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు సమర్థనీయం కాదని, ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని, రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని, గత ప్రభుత్వం ప్రారంభించిన పెట్టుబడి సాయం రైతుబంధు పథకాన్ని, రైతు భరోసాగా మార్చి సాయం మరింత పెంచినా విడుదల చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
పొలాలు దున్ని నాట్లు వేసి కలుపు తీసిన, పంట కోతకు వచ్చినా ఇప్పటివరకు యాసంగి రైతు భరోసా మొత్తం రైతుల ఖాతాలో జమకాక పోవడం దారుణమని, రైతు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి,కొయ్యడ సృజన్ కు మార్,బోయిని అశోక్,టేకుమల్ల సమ్మయ్య, నాగెల్లి లక్ష్మారెడ్డి,బోయిని తిరుపతి, న్యాలపట్ల రాజు, ఏ ఐ ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బీర్ల పద్మ, నాయకులు గామినేని సత్యం, కూన రవి, శాంత కుమార్, తదితరులు పాల్గొన్నారు.




