18 April, 2026 | 3:01 AM

ఆబ్కారీ శాఖలో అవినీతి కిక్కు!

18-04-2026 01:33 AM

కొందరు అధికారులది ఆడిందే ఆట

ఉన్నచోట పాతుకుపోవుడే.. ప్రమోషన్లు వచ్చినా కదలరు 

బదిలీ అయినా డిప్యుటేషన్‌పై మళ్లీ పాత స్థానానికే 

ఎస్టీఎఫ్‌లో ఏపీకి చెందిన ఓ ఆధికారిదే పెత్తనం

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) : ఆబ్కారీ శాఖలో అవినీతి తిమిం గలాలు అధికమయ్యారు. కొందరు అధికారుల తీరు  ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైందనే ఆరోపణలు వస్తున్నాయి. సర్కార్‌కు ఆదాయం తీసుకొచ్చే శాఖలో కొంతమంది అనేక సంవత్సరాలుగా ఉన్నచోట పాతుకపోవడం, శాఖలోని లొసుగులను ఆస రగా చేసుకుని.. అందినకాడికి దండుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు.

ప్రభుత్వంలో పలుకుబడిని ప్రయోగించి కొంద రు అధికారులు ప్రమోషన్ వచ్చినా కదలకుండా అక్కడే ఉండటం, ఒకవేళ బదిలీ అయినా ఏడాది తిరగముందే తిరిగి పాతచోటుకే రావడం, మరికొందరు జిల్లాలకు బదిలీ అయినప్పటికి.. డిప్యూటేషన్‌పై మళ్లీ తమకు కావాల్సిన విభాగంలోనే పోస్టింగ్‌లు తెచ్చుకొని అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా స్టేట్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ (డీటీఎఫ్)లో పనిచేసే కొందరు అధికారుల చేతివాటం ఎక్కువైందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లుగా సమాచా రం.

గంజాయి, ఎండీఏం, డ్రగ్స్, నకిలీ మ ద్యం కేసుల్లో అందినకాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రెం డు విభాగాలకు చెందిన కిందిస్థాయి సిబ్బం ది ద్వారానే ఈ వసూళ్ల దందా జరుగుతుందని, అందుకే తమకు నచ్చిన కానిస్టేబుళ్లను డిప్యూటేషన్ తీసుకొచ్చి ఇక్కడ అక్రమాలు, అవినీతి కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

స్టేట్ టాస్క్‌ఫోర్స్‌లో ఏపీకి చెందిన ఒక అధికారిదే పెత్తనం సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవలనే ఆ యన ఉత్తర తెలంగాణకు బదిలీ అయినప్పటికి.. ఏడాది తిరగకముందే ఉమ్మడి నల్ల గొండ జిల్లాకు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత వెనువెంటనే డిప్యూటేషన్‌పై ఎస్టీఎఫ్‌లోకి తిరిగొచ్చి, మళ్లీ తన వాహను కొ నసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. 

ప్రమోషన్ వచ్చినా అక్కడే.. 

మేడ్చల్ జిల్లా పరిధిలోని ఒక అధికారికి జాయింట్ కమిషనర్‌గా ప్రమోషన్ వచ్చినా అక్కడి నుంచి కదలడం లేదనే విమర్శలున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో పోస్టింగ్ అయితేనే మేడ్చల్ జిల్లా నుంచి కదులుతానని సదరు ఉన్నతాధికారి బీష్మించుకుని కూర్చుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ కోసం అధికార పార్టీకి చెందిన ఒక బడా నేతను పట్టుకుని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పైరవీ చేసుకుంటున్నారని ఆబ్కారీ శాఖలో చర్చ జోరుగా సాగుతోంది.

ఇక  రంగారెడ్డి జిల్లా పరిధిలో ఒక ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు అసిస్టెంట్ కమిషనర్‌గా ప్రమోషన్ వచ్చింది. అయితే  సదరు ఆఫీసర్ మళ్లీ ఫోకల్ పోస్టుపైనే దృష్టి పెట్టి.. అక్కడినుంచి కదలడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక మేడ్చల్ పరిధిలోని ఒక అధికారితో పాటు ఒక సీఐ, ఎస్‌ఐ కలిసి అక్రమ వసూళ్లలో కింగ్‌మేకర్ అయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన పని చేసిన జిల్లాలోనూ అయనపై అనేక ఆరోపణలు వచ్చాయని, ప్రస్తుతం కిందిస్థాయి సి బ్బందికి టార్గెట్ పెట్టి ఆయన వసూళ్లు చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక, సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో పనిచేసే ఇద్దరు ఎక్సైజ్ సీఐలకు రెగ్యులర్‌గా వచ్చే మాముళ్లు సరిపోక వారి పరిధిలోని బార్లు, వైన్‌షాపులపై వేరే వారితో కేసులు నమోదు చేయించి అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ అదే పరిస్థితి ఉంది. మాముళ్లు ఇవ్వని వైన్‌షాపులు, బార్ షాపు ల యజమానులకు అధికారులు చుక్కలు చూపిస్తు న్నారనే ప్రచారం ఉంది. అనుకున్న వాటా రాకపోతే దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు.   

సర్కార్‌కు నివేదిక.. 

ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని కొందరు సీఐ లు, ఎస్‌ఐలు వైన్‌షాపులు, బార్ యజమానులను కేసుల పేరుతో బెదిరిస్తు న్నట్టుగా ప్రభుత్వానికి ఈమధ్య ఫిర్యాదులు అందడంతో దానిపై అంతర్గతంగా విచారణ ప్రా రంభించినట్టుగా తెలిసింది. త్వరలో జరిగే బదిలీల్లో ఎస్‌ఐలు, సీఐలు, ఏఈఎస్‌లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల పనితీరు, వారి అవినీతి భాగోతాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పోస్టింగ్ ఇవ్వాలని, ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలిసింది. అందులో భాగంగా ఇప్పటికే అంతర్గతంగా వారి రిపోర్టు సైతం ప్రిన్సిపల్ సెక్రటరీ తెప్పించుకున్నట్టుగా సమాచారం.  

20 లక్షలు ఇచ్చి.. 

ఇటీవల గంజాయి కేసులో ఓ వ్యక్తిని ఎస్టీఎఫ్ అధికారులు అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆ వ్యక్తి నుంచి ఫోన్‌ను ఎస్టీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌ను చెక్ చేయగా ప్రముఖ కంపెనీకి చెందిన యజమాని మనువడని తేలింది. ఆ వ్యక్తికి సబంధించి గంజాయి తీసుకుంటున్న వీడియో ఎస్టీఎఫ్ అధికారులకు దొరికింది. వెంటనే ఎస్టీఎఫ్‌లో పనిచేసే ఓ అధికారి ఆ ప్రముఖ కంపెనీకి చెందిన యజమానికి ఫోన్ చేసి.. అరెస్టు చేస్తానని బెదిరించినట్లుగా తెలిసింది.

ముందుగా ఆ కంపెనీ యజమాని ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి తన మనువడిని ఎస్టీఎఫ్  అధికారులు అదుపులోకి తీసుకున్న విషయమై మొరపెట్టుకోగా, ఆ ఎమ్మెల్యే వెంటనే ఎస్టీఎఫ్  అధికారితో సంప్రదింపులు జరిపారని.. ఆ అధికారి డబ్బులు డిమాండ్ చేయడంతో గంటలోపే ప్రముఖ కంపెనీ యజమాని రూ.20 లక్షలు ఇచ్చి ఆయన మనువడిని ఇంటికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది. ఇదే విషయం ప్రభుత్వానికి ఫిర్యాదు అందినట్లుగా సమాచారం. 

డిఫెన్స్ బాటిళ్ల విక్రయం.. 

సికింద్రాబాద్ పరిధిలో పనిచేసే ఒక ఎక్సైజ్ అధికారి డిఫెన్స్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నప్పుడు, వాటిని ధ్వంసం చేయకుండా ఇతరులకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్నతాధికారులు ఆయనను ఒకసారి మందలించినా ఆయనలో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. శంషాబాద్ పరిధిలో డీటీఎఫ్‌లో పనిచేసే ఒక అధికారిపై భారీగా ఆరోపణలు రావడంతో ఆయనపై ఉన్నతాధికారులు నిఘా పెట్టినట్టుగా తెలిసింది. 

సీక్రెట్ ఫండ్స్‌లోనూ..

ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్‌మెంట్‌లో ఇన్ఫార్మర్ల పేరుతో ఏర్పాటుచేసే సీక్రెట్ ఫండ్‌కు సంబంధించి కోటి రూపాయలను  అధికారులు కలిసికట్టుగా స్వాహా చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ డబ్బుకు సంబంధించి ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేకపోవడంతో ఇన్ఫార్మర్ల పేరుతో ఆ డబ్బును ఇద్దరు అధికారులు స్వాహా చేశారని ఇప్పటికే దీనిపై ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు అందినట్టుగా సమాచారం. ఇలా, ఎస్టీఎఫ్, డీటీఎఫ్‌లో చాలాకాలంగా పాతుకుపోయినవారే ప్రస్తుతం చక్రం తిప్పుతూ అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.