18 April, 2026 | 3:03 AM

ఫిన్లాండ్ దేశ విద్యావిధానం అధ్యయనం బృందంలో ఉపాధ్యాయురాలు విశ్వశాంతి

18-04-2026 01:34 AM

ఘట్ కేసర్, ఏప్రిల్ 17 (విజయకాంతి) : ప్రపంచంలోనే అత్యున్నత విద్యా విధానం కలిగినటువంటి ఫిన్లాండ్ దేశ విద్యా విధానాన్ని అధ్యయనం చేయటానికి తెలంగాణ విద్యాశాఖ ఎంపిక చేసిన 28 మంది ఉపాధ్యాయుల  బృందంలో మేడ్చల్ జిల్లాలోని ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని చౌదరిగూడ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు విశ్వశాంతి కి స్థానం దక్కింది.

18 సంవత్సరాల బోధనా అనుభవం కలిగిన విశ్వశాంతి నిరంతరం పాఠశాల విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటుగా జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యక్ర మాలలో రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలకు సంబందించిన పలు మాడ్యూల్ల రూపకల్పనతో పాటుగా పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యకు సంబందించిన వర్క్ బుక్స్, హ్యాండ్ బుక్స్ రచనలో తమ సేవలను అందించారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎక్స్పోజర్ విసిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ చేంజ్ కార్యక్రమం కొరకు రాష్ట్ర నలుమూలల నుంచి ఎంపిక కాబడిన ఉపాధ్యాయులను నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసి ప్రపంచం లోనే అత్యున్నత విద్యావిధానాలు కలిగిన ఫిన్లాండ్, జపాన్, సింగపూర్, వియత్నాం దేశాలకు ఒక్కో బృందాన్ని పంపించడానికి నిశ్చయించారు. 

మొదటి 40 మంది నిపుణుల బృందం ఈనెల 18వ తేదీన పిన్లాండ్ దేశ పర్యటనకు బయలుదేరుతున్నారు. వీరిలో 28 మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, 12 మంది విద్యాశాఖ అధికారులు ఉన్నారు. వీరి తో పాటు సెక్రటరీ గారైన డాక్టర్ యోగితా రాణా (ఐఏఎస్), ఎస్.సి.ఈ.ఆర్.టి డైరెక్టర్  జి. రమేష్ ఉన్నారు. ఈ బృందం ఏప్రిల్ 20 నుంచి 24 వరకు అక్కడి పాఠశాలలను, టీచర్ ట్రైనింగ్ సెంటర్ లను సందర్శించి, కరికులం వారు అవలంభించే పద్దతులను, విద్యార్థుల స్థాయిలను పరిశీలించి తద్వారా నూతన పోకడలను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందిస్తుంది.

విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వీరి పర్యటన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. విశ్వశాంతి ఎంపిక కావటం మాజిల్లాకు ఎంతో గర్వ కారణం అని జిల్లా విద్యాశాఖాధికారిణి  విజయకుమారి  ప్రశంసించారు. మా పాఠశాల ఉపాధ్యాయిని ఎంపిక కావటం మాకెంతో గర్వ కారణం అని ప్రధానోపాధ్యాయులు సాంబమూర్తి, పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.