ఎక్సైజ్ శాఖ ప్రతిష్టను పెంచేలా పనిచేయాలి
మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): అబ్కారీ శాఖ ప్రతిష్టను పెంచేలా అధికారులు పనిచేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఏఈఎస్ స్థాయి నుంచి అడిషనల్ కమిషనర్ స్థాయి వరకు మొత్తం 53 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న తమకు పారదర్శకంగా పదోన్నతులు కల్పించినందుకు దన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదోన్నతులు పొందిన అధికారులు మరింత ఉత్సాహంతో, బాధ్యతా యుతంగా విధులు నిర్వర్తించాలన్నారు.
కల్తీ, అక్రమ మద్యం, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని మంత్రి జూపల్లి సూచించారు. మంత్రిని కలిసిన వారిలో అడిషనల్ కమిషనర్లు ఎస్.వై. ఖురేషి, సురేష్ రాథోడ్, డిప్యూటీ కమిషనర్లు జె. హరికిషన్, చంద్రయ్య, అసిస్టెంట్ కమిషనర్లు డి. శ్రీనివాస్, ప్రదీప్‌రావు, జ్యోతికిరణ్, పంచాక్షరి, ఆర్.కిషన్‌తో పాటు ఈఎస్లు ఏ.కిషన్, తుక్యా నాయక్, జీవన్ కిరణ్, తదితరులు ఉన్నారు.






