17 April, 2026 | 3:07 AM

ఆటో, ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి

17-04-2026 12:00 AM
  1. ఇద్దరికి గాయాలు.. పరారీలో లారీ డ్రైవర్
  2.  అడిషనల్ కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం

అశ్వారావుపేట, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో, ట్రాక్టర్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ చిట్టూరి కృష్ణయ్య (52), రోజువారీ కూలీ ఊట్లపల్లి గ్రామానికి చెందిన కొవ్వాసి నాగరాజు (35)ఘటన స్థలంలోనే మృతి చెందగా,  మడకం సంతోష్  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఊట్లపల్లి చెందిన సోయం రమేష్, ఏపీలోని టీ నర్సాపురం మండలం రావమ్మగూడెం గ్రామానికి చెందిన మడకం సోమరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. సోమరాజును ఏలూరు ఆశ్రమ హాస్పిటల్‌కు తరలించగా, గద్దల వెంకటరావు ఆటోడ్రైవర్ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ రైతు వేదిక వద్ద జరుగుతున్న కార్యక్రమానికి వెళ్లేందుకు ఆగారు.

వెనక నుంచి లారీ ఆటోను ఢీకొనడంతో ఆటో అడిషనల్ కలెక్టర్ కారు వెనుక భాగాన్ని ఢీ కొట్టింది. కారు స్వల్పంగా ధ్వంసం అయింది. అడిషనల్ కలెక్టర్‌కు ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోవడంతో క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.