12 August, 2026 | 1:35 AM

ప్రశ్నల చట్రం ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం

12-08-2026 12:00 AM

విదేశీ విరాళాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విదేవీ విరాళాల నియంత్రణ (ఎఫ్‌సీఆర్‌ఏ) సవర ణ బిల్లు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మార్చి 25న లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రస్తుతం పార్లమెంటు పరిశీలనలో ఉంది. విదేశీ నిధులతో ఏర్పడిన ఆస్తులు, సంస్థల ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్ రద్దు, స్వచ్ఛందంగా రద్దు చేయడం లేదా పునరుద్ధరణ జరగని సందర్భాల్లో ‘డిజిగ్నేటెడ్ అథారిటీ’ని ఏర్పాటు చేయడం ఈ బిల్లులోని ప్రధాన ప్రతిపాదనలు.

ఈ మార్పులపై అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రైలీవర్ ఇటీవల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చర్చీలు, క్రైస్తవ సంస్థలపై సవరణల ప్రభావం ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ -అమెరికా సంబంధాలను కూడా బిల్లు దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఈ అంశంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈనె 7న స్పష్టమైన సమాధానమిచ్చిం ది. ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ భారతదేశ అంతర్గత శాసన ప్రక్రియకు సంబంధించిన అంశమని స్పష్టం చేసింది.

విదేశీ నిధుల నియంత్రణ విషయంలో చట్టాలు చేసుకునే సంపూర్ణ హక్కు భారతదేశానికి ఉందని స్పష్టం చేసింది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతున్నది. భారతదేశంలో విదేశీ నిధులను ఎలా నియంత్రించాలి? విదేశాల నుంచి వచ్చే నిధులను ఎవరు స్వీకరించాలి? వాటిని ఏ ప్రయోజనాలకు వినియోగించాలి? వాటి లెక్కలు ఎలా ఉండాలి? నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే విషయాలను నిర్ణయించాల్సింది భారత పార్లమెంటా? లేక విదేశీ ప్రభుత్వాలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విమర్శలు వేరు.. సార్వభౌమధికారం వేరు

భారతదేశం ఒక సార్వభౌమ ప్రజాస్వామ్య దేశం. తన భద్రత, ఆర్థిక ప్రయోజనాలు, సామాజిక స్థిరత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని చట్టాలు చేసుకునే హక్కు భారత పార్లమెంట్‌కు ఉంది. అమెరికా అయి నా, మరే ఇతర దేశమైనా భారత చట్టంపై అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. విమర్శించవచ్చు. ఆందోళన వ్యక్తం చేయవచ్చు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ స్వేచ్ఛకు స్థానం ఉంది. కానీ.. అభిప్రాయం వ్యక్తం చేయడం వేరు, ఒక సార్వభౌమ దేశ శాసన ప్రక్రియ పై ప్రభావం చూపాలని ప్రయత్నించడం వేరు.

ఈ రెండింటి మధ్య ఉన్న సున్నితమై న గీతను గుర్తించడం చాలా అవసరం. అమెరికా ప్రజాప్రతినిధులు భారత్‌లోని చట్టాలపై మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. కానీ ఇక్కడ ప్రశ్న అమెరికా మాట్లాడిందా లేదా అన్నది మాత్రమే కాదు. భారతదేశం లో ఏ చట్టం ఉండాలి, ఏ నిబంధనలు అమలులో ఉండాలనే తుది నిర్ణయం ఎవరిదన్న దే అసలు విషయం. ఆ నిర్ణయం భారత ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్‌దే కావాలి. విదేశీ అభిప్రాయాలు భారత శాసన ప్రక్రియను ప్రభావితం చేసే స్థాయికి చేరకూడదు.

అయితే సార్వభౌమత్వం పేరుతో దేశంలో వ్యక్తమవుతున్న అభ్యంతరాలను కూడా ప్రభుత్వం పక్కన పెట్టలేం. ఎఫ్‌సిఆర్‌ఏ సవరణ బిల్లులో ప్రభుత్వానికి విస్తత అధికారా లు లభించే అవకాశం ఉందని ప్రతిపక్షాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్ రద్దయి నా, సంస్థ స్వచ్ఛందంగా రద్దు చేసుకున్నా లేదా పునరుద్ధరణ జరగకపోయినా విదేశీ నిధులతో ఏర్పడిన ఆస్తుల నిర్వహణపై ప్రభుత్వం నియంత్రణ సాధించే అవకాశం ఉండటం చర్చనీయాంశంగా మారింది. 

విశ్లేషణలు ఏం చెబుతున్నాయంటే..

విదేశీ నిధులు, వాటితో ఏర్పడిన ఆస్తులను డిజిగ్నేటెడ్ అథారిటీ పర్యవేక్షించే విధానాన్ని ఈ బిల్లు ప్రతిపాదిస్తున్నది. ప్రార్థనా స్థలాల విషయంలో వాటి మతపరమైన స్వరూపాన్ని కొనసాగించే నిబంధన కూడా ప్రతిపాదిత చట్టంలో ఉంది. ప్రభుత్వం మా త్రం ఈ సవరణలు ఏ మతాన్ని, ఏ సంస్థను లక్ష్యంగా చేసుకునేందుకు కాదని స్పష్టం చేస్తున్నది. విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే తమ ఉద్దేశమని చెబుతున్నది.

విదేశీ నిధులు దేశ భద్రతకు, ప్రజా శాంతికి లేదా సామాజిక స్థిరత్వానికి ముప్పుగా మారకుండా నియంత్రించడం ప్రభుత్వ బాధ్యత అని కేంద్రం వాదిస్తున్నది. విదేశీ నిధుల స్వీకరణ, వినియోగంపై స్పష్టమైన నియంత్రణ ఉండటం ఏ సార్వభౌమ దేశానికైనా సహజమైన అవసరమే. నిజానికి విదేశీ నిధుల నియంత్రణ అనేది భారతదేశానికి మాత్రమే సంబంధించిన అంశం కాదు. ప్రపంచంలో ని అనేక ప్రజాస్వామ్య దేశాలు విదేశీ నిధులు, విదేశీ ప్రభావం, విదేశీ సంస్థల కార్యకలాపాలపై వివిధ రకాల నియంత్రణాలు అమలు చేస్తున్నాయి. అమెరికా కూడా విదేశీ నిధులు, విదేశీ ప్రభావం, విదేశీ సంస్థల కార్యకలాపాల విషయంలో తన సొంత చట్టపరమైన వ్యవస్థను కలిగి ఉంది. 

కేంద్ర ప్రభుత్వ బాధ్యతలు

మతపరమైన సంస్థల విషయంలో ప్రభు త్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. విదేశీ నిధులు స్వీకరించే సంస్థ హిందూ సంస్థ అయినా, క్రైస్తవ సంస్థ అయినా, ముస్లిం సంస్థ అయినా, బౌద్ధ సంస్థ అయినా నిబంధనలు అందరికీ ఒకే విధంగా ఉండాలి. చట్టం మతాన్ని చూసి మారకూడదు. నిధుల వలం, వాటి వినియోగం, చట్టపరమైన అనుసరణ ఆధారంగానే చర్యలు ఉండాలి. అదే నిజమైన లౌకిక ప్రజాస్వామ్యానికి ప్రాథమిక ప్రమాణం.

ఇక్కడ అమెరికా పాత్రను కూడా సరైన కోణంలో చూడాలి. అమెరికా కాంగ్రెస్ సభ్యుడికి తన దేశం తరఫున లేదా తన వ్యక్తిగత అభిప్రాయంగా భారత చట్టంపై ఆందోళన వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంది. కానీ ఆ అభిప్రా యం భారత పార్లమెంటు నిర్ణయాన్ని నిర్దేశించే స్థాయికి వెళ్లకూడదు. భారత్-అమెరికా సంబంధాలు వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ, సాం కేతిక రంగాల్లో ఎంతో ముఖ్యమైనవి. అందువల్ల ఇలాంటి విభేదాలను ఘర్షణగా కాకుండా దౌత్యపరమైన పరిపక్వతతో పరిష్కరించుకోవాలి.

స్నేహం అంటే ఒక దేశం మరో దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కానే కాదు. స్నేహం అంటే పరస్పర సార్వభౌమత్వాన్ని గౌరవించడం. అమెరికా తన దేశంలో చట్టాలు చేసుకునే స్వేచ్ఛను ఎలా కాపాడుకుంటుందో, భారత్ కూడా తన శాసన స్వతంత్రాన్ని అదే విధంగా కాపాడుకోవాలి. అయితే భారత ప్రభుత్వం కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. సార్వభౌమత్వం అంటే ప్రభుత్వానికి లభించే అపరిమిత అధికారం కాదు. సార్వభౌమత్వం అంటే ప్రజల ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా, న్యాయబద్ధంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ. అందువల్ల ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు ఆ ప్రమాణాలను కచ్చితంగా అందుకోవాలి.  

పారదర్శకత అవసరం

అమెరికా అభ్యంతరాలు భారత పార్లమెంటు నిర్ణయాన్ని ప్రభావితం చేయకూడదు. అదే సమయంలో దేశంలో వ్యక్తమవుతున్న అభ్యంతరాలను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదు. పార్లమెంటు పరిశీలనలో ఉన్న ఈ బిల్లుపై ప్రజా ప్రతినిధులు, న్యాయ నిపుణులు, పౌర సమాజం, సంబంధిత సంస్థల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు చేయడం ప్రజాస్వామ్య ప్రక్రియను మరింత బలోపేతం చేస్తుంది.

చివరికి ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లు ఎవరి విజయం, ఎవరి ఓటమి అనే రాజకీయ ప్రశ్నగా మిగలకూడదు. అది భార త సార్వభౌమత్వాన్ని కాపాడుతూ, విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అరికడుతూ, నిజాయతీగా సేవ చేస్తున్న సంస్థలకు రక్షణ కల్పించే సమతుల్య చట్టంగా రూపుదిద్దుకోవాలి. అమెరికా అభిప్రాయం చెప్పవచ్చు, విమర్శించవచ్చు, ఆందోళన వ్యక్తం చేయవచ్చు. కానీ భారత చట్టాన్ని రూపొందించే అధికారం మాత్రం పూర్తిగా భారతదేశానిదే.

ఆ నిర్ణయం విదేశీ ఒత్తిడితో కాకుండా భారత రాజ్యాంగం, దేశ ప్రజల ప్రయోజనాలు, పారదర్శక ప్రజాస్వామ్య ప్రక్రియ ఆధారంగా ఉండాలి. సార్వభౌమత్వమంటే విదేశాల మాట వినకపోవడం మాత్రమే కాదు. న్యాయం, పారదర్శకత, సమానత్వంతో చట్టాన్ని రూపొందించగలగడం.

 వ్యాసకర్త సెల్: 99484 39565